రివైండ్ – 2015 : ఆనందం.. ఆశ్చర్యం.. విషాదం.. ఘోరం..!!

Friday, January 1st, 2016, 03:39:31 AM IST

2015వ సంవత్సరం ముగిసిపోయింది. చూస్తుండగానే రోజులు, వారాలు, నెలలు నీటి బుడగల్లా మాయమయ్యాయి. ఈ 365 రోజుల్లో మన కళ్ళ ముందు ఎన్నో అద్బుతాలు, ఆనందాలు, ఆశ్చర్యాలు, విషాదాలు, ఘోరాలు సంభవించాయి. అన్నింటినీ సంతోషంగా ఆస్వాదించాం, ఆతురతతో ఆహ్వానించాం, భయంగానే భరించాం. కానీ కాలక్రమంలో అన్నింటినీ మర్చిపోయాం. అందుకే ఒక్కసారి 2015 ను రివైండ్ చేసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం..

ఆనందం :

ఈ యేడు మనం ఆనందించిన క్షణాలు చాలానే ఉన్నాయి. అవి..
1. సుందర్ పిచై : మద్రాసులో పుట్టిన సుందర్ పిచై అంతర్జాల దిగ్గజం గూగుల్ కు ఈ యేడు ఆగస్టు 10న సీఈఓ గా ఎంపికయ్యారు.

2. ISRO రికార్డ్ : శ్రీహరి కోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO ఈ ఏడాది డిసెంబర్ 16న PSLV – 29 ను విజయవంతంగా గగనతలంలోకి పంపి తన 50వ లాంచింగ్ ను పూర్తి చేసుకుంది.

3. మోదీ పాక్ పర్యటన: ఎప్పటి నుండో భారత్ – పాక్ ల మధ్య ఉన్న సంబందాలు, జరుగుతున్న శాంతి చర్చలు కొంతకాలంగా దెబ్బ తింటూ వచ్చాయి. దీంతో భారత్ లో ఉగ్ర ముప్పు మరీ ఎక్కువైంది. ఆ సమయంలో మోదీ డిసెంబర్ 25న ధైర్యంగా పాక్ పర్యటనకు వెళ్లి నవాజ్ షరీఫ్ ను కలిసి సంబంధాలను కాస్త మెరుగుపరిచే ప్రయత్నం చేశారు.

4. అమరావతి శంఖుస్థాపన: ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంద్ర ఏర్పడ్డాక ఆంద్రుల కలల రాజధాని అమరావతికి సెప్టెంబర్ 22న అంగరంగ వైభవంగా శంఖుస్థాపన జరిగింది.

5. తెలంగాణాలో చండీ యాగం : తెలంగాణా సీఎం కేసీఆర్ అందరి క్షేమం కోసం డిసెంబర్ 23న మహా ఆయుత చండీ యాగం 5రోజుల పాటు నిర్వహించారు.

6. సానియా విజయ పరంపర : భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా ఈ యేడు డబుల్స్ లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ తో సహా మార్టినా హింగిస్ తో కలిసి 10 టైటిళ్ళను సాదించి డబుల్స్ లో నెంబర్ 1 ర్యాంకును దక్కించుకుంది.

7. బాల నేరస్తుల చట్ట సవరణ: నిర్భయ నిందితుని విడుదల తరువాత బాల నేరస్తుల వయసును 18 నుండి 16 కు తగ్గిస్తూ 22న రాజ్య సభలో బిల్లు పాసవడం కొంత ఆనందించదగ్గ విషయం.

ఆశ్చర్యం :

ఈ సంవత్సరం మనమస్సాలు ఊహించని, అనుకోని సంఘటనలు చాలానే జరిగి మనల్ని ఆశ్చర్యపరిచాయి.

1. జుకర్ బర్గ్ విరాళం: ఫేస్ బుక్ అదినేత మార్క్ జుకర్ బర్గ్ డిసెంబర్ 2న తన కంపెనీలోని సొంత వాటాలను ప్రపంచ సంక్షేమం కోసం విరాళమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ మొత్తం విలువ 45 బిలియన్ డాలర్లు.

2. ఢిల్లీ లో ఆప్ విజయం: దేశ రాజధాని ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు గాను 67 గెలిచి బీజేపీని మట్టి కరిపించి ఫిబ్రవరి 7 న తన ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

3. బీహార్ లో మహాకూటమి విజయం: ఈ యేడు బీహార్ లో అక్టోబర్ – నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ల కలయికతో ఏర్పడ్డ మహా కూటమి 243 అసెంబ్లీ స్థానాలకు గాను 178 గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

4. మోడీ విదేశీ పర్యటనలు: ప్రధాని మోదీ ఈ ఒక్క సంవత్సరంలోనే సింగపూర్, బ్రిటన్, టర్కీ, చైనా, జర్మనీ, శ్రీ లంక, పాకిస్తాన్ వంటి 25 దేశాల్లో పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

5. బాహుబలి విజయం: ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి అందరి అంచనాలను మించి ప్రపంచస్థాయి విజయాన్ని సాదించి 600 కోట్ల రూపాయల వసూళ్లను సాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

విషాదం:

ఈ ఏడాది భారత్ లో పాటు ప్రపంచంలో అనుకోని కొన్ని సంఘటనలు, ప్రకృతి విపత్తులు జరిగి అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించి అందరికీ విషాదాన్ని మిగిల్చాయి.
1. నేపాల్ భూకంపం: ఏప్రిల్ 25న నేపాల్ లో సంభవించిన ఈ భూకంపం నేపాల్ ను స్మశానంగా మార్చింది. ఈ విపత్తులో 9 వేల మంది చనిపోగా 23 వేల మంది గాయపడ్డారు. అలాగే 34 వేల కోట్ల ఆస్థి నష్టం కూడా సంభవించింది.

2. చెన్నై వరదలు : ఈ యేడు డిసెంబర్ లో తమిళనాడు చెన్నైలో సంభవించిన వరదలు చెన్నైను నరకంగా మార్చాయి. ఈ వరదల్లో చిక్కుకుని 400 మంది చనిపోగా వేల కోట్ల నష్టం వాటిల్లింది. దాంతో పాటు ఎందరో నిరాశ్రయులయ్యారు. దాదాపు 120 సెంటీమీటర్ల వర్షం కురిసి చెన్నై నగరంలోని అన్ని రంగాలనూ దెబ్బ తీసింది.

3. హజ్ యాత్ర తొక్కిసలాట : 2015 సెప్టెంబర్ లో మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 2000 మందికి పైగా భక్తులు మరణించారు. వేలమంది గాయాలపాలయ్యారు.

4. అబ్దుల్ కలాం మరణం : జూలై 27న భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మరణం భారతీయులను కలిచివేసింది.

5. వ్యాపార ప్రముఖుల మరణం: ఈ యేడు భారత్ లో హీరో గ్రూప్ అదినేతలుయ్ బ్రిజ్ మోహన్ లాల్, హీరో సైకిల్స్ చర్మాన్ ఓం ప్రకాష్ మంజాల్ కన్ను మూశారు.

6. సినీ ప్రముఖుల మరణం: ఏ యేడు పలువురు తెలుగు సినీ ప్రముఖులు మరణించారు. వారిలో రామానాయుడు, ఆహుతి ప్రసాద్, గణేష్ పాత్రో, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, ఆర్తి అగర్వాల్, కళ్ళు చిదంబరం, మనోరమ, ఏడిద నాగేశ్వర రావు, వీ బీ. రాజేంద్ర ప్రసాద్, రంగనాథ్ ఉన్నారు.

ఘోరం :

ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోయి పలు మారణ కాండాలను సృష్టించారు. ఈ మారణకాండలో ఏంటో మంది ప్రాణాలు కోల్పోగా సిరియా వంటి దేశాల్లో ప్రజలు ఇతర దేశాలకు వలస బాట పట్టారు.

1. సిరియా లో ఐసిస్ : ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సిరియా దేశంలో ప్రధాన రాష్ట్రాలను ఆక్రమించుకుని ఆ దేశ ప్రజలను గతి లేని వాళ్ళను చేసి దేశం విడిచి ఇతర దేశాలకు పారిపోయేలా చేశారు. ఈ వలస సమయాల్లో ప్రజలు నానా అవస్థలూ పడి 223 మంది ప్రాణాలను కోల్పోయారు.

2. భారత్ లో అసహనం: భారత్ లో కొన్ని మతవాద శక్తులు కలిసి గో మాంసం వంటి వివాదాలను సృష్టించి పలు ఘోరమైన సంఘటనలకు కారణమయ్యారు. ఈ అసహనం మూలంగా కొందరు అమాయకులు ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ అసహనం భారత రాజకీయాలలోని కొన్ని సమీకరణాలను కూడా మార్చాయంటే అవి ఎంత ప్రభావం చూపాయో తెలుస్తుంది.

3. పారిస్ దాడి : ఐసిస్ ఉగ్రవాద సంస్థ రెచ్చిపోయి పారిస్ అనగరంపై విరుచుకు పది నవంబర్ 13న 150 మందిని, జనవరిలో నైజీరియాలో 150 మందిని, టర్కీలో 102, సిరియాలో 223, కెన్యాలో 140 మందినీ చంపి నరమేధం సృష్టించింది.

4. నిర్భయ నిందితుని విడుదల : ఈ యేడు రెండేళ్ళ క్రితం ఢిల్లీ లో జరిగిన నిర్భయ రేప్ జువైనల్ నిందితుడు తన మూడేళ్ళ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 21న విడుదలై మళ్ళీ సభ్య సమాజంలోకి అడుగు పెట్టేందుకు సిద్దమయ్యాడు.

5. రష్యా విమానం కూల్చివేత : ఈ యేడు నవంబర్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రష్యా విమానం పై మిస్సైల్ దాడి చేసి 224 మంది ప్రయాణీకులను పొట్టనబెట్టుకున్నారు.