ఇకపై నగరంలో 4జీ

Wednesday, September 17th, 2014, 10:04:50 AM IST


హైదరాబాద్ నగరంలో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.కాగా మాదాపూర్ ఐటి కారిడార్ లో వైఫై సేవలందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇందు నిమిత్తం రిలయన్స్ సంస్థ 4జీ అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు దాదాపు పూర్తి చేసింది. ఇక శిల్పారామంలో ప్రతీ 250మీటర్ల దూరానికి ఆరేసి వైఫై పాయింట్లను ఏర్పాటు చేసింది. కాగా ఈ సదుపాయంతో ఐటి ఉద్యోగులతో పాటు విద్యార్ధులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకోనున్నారు.

అలాగే శిల్పారామంలో ప్రధాన ద్వారం వద్ద, నైట్ బజార్, అంపీ థియేటర్, రూరల్ మ్యుజియం, కోనసీమ మొదలగు రద్దీ ప్రదేశాలలో వైఫై పాయింట్లను ఏర్పాటు చేశారు. అంపీ థియేటర్ వద్ద గ్రౌండ్ బాస్ మాస్ట్(జీబీఎం)ను ఏర్పాటు చేసారు. ఈ జీబీఎం దాదాపు 500మీటర్ల రేడియేషన్ ను కవర్ చెయ్యడంతో శిల్పారామంలో అన్ని చోట్ల వైఫై అందుబాటులో ఉంటుంది. ఇక హైటెక్ సిటీలో సైబర్ పెరల్, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హెచ్ఐసీసీ వద్ద కూడా ఈ వైఫై పాయింట్లను ఏర్పాటు చేశారు. దీనితో హైటెక్ కారిడార్ మొత్తానికి 4జీ వైఫై సేవలు అందనున్నాయి.