పంజాబ్ దారుణ కాండ ముగిసినట్టేనా..?

Sunday, January 3rd, 2016, 06:39:59 PM IST


నిన్న తెల్లవారు జామున పంజాబ్ లోని పఠాన్ కోట్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదులు మారణ కాండను సృష్టించారు. పాక్ సరిహద్దుకు కేవలం 30కి. మీ దూరంలో ఉన్నఈ బేస్ వెనుక భాగంలో ఉన్న అడవుల్లోంచి దాదాపు 7గురు ఉగ్రవాదులు ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఎయిర్ బేస్ వైపుకు దూసుకోచ్చారు. వారిని గుర్తించిన భద్రతా దళాలు వారితో పోరాడి 5 గురిని అక్కడే మట్టుబెట్టారు.

ఈ పోరులో లెఫ్ట్ నెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ తో సహా 5గురు సైనికులు చనిపోయారు. బయట ఉన్న ఉగ్రవాదులు చనిపోవడంతో ఆపరేషన్ ముగిసిందని అధికారులు అనుకున్నారు. కానీ అప్పటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోనికి చొరబడటం అధికారులు గుర్తించలేదు. ఆపరేషన్ ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోపే ఈరోజు ఆదివారం ఆ ఇద్దరు దాడికి తెగబడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ఇద్దరినీ కూడా హతమార్చారు. కానీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఇద్దరు సైనికులు చనిపోయారు. మొత్తం మీద ఈ దాడిలో ఇప్పటి వరకూ 7గురు సైనికులు చనిపోయారు. ఇంకా ఆపరేషన్ ముగిసినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.