కేసీఆర్ పై నటుడు సుమన్ ప్రశంసలు

Sunday, November 23rd, 2014, 02:23:01 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినీ నటుడు సుమన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ పాలనాదక్షత అద్వితీయమని, ఆయన పాలనలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందని అన్నారు. తెలంగాణను బాగుచేద్దామనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉంటే, విపక్షాలు ప్రతి విషయంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. రాత్రికిరాత్రే అభివృద్ధి జరగాలంటే సాధ్యం కాదని, చిన్నచిన్న తప్పులు జరగడం సహజమేనన్నారు. నల్గొండ జిల్లాలోని భువనగిరి రహదారిబంగ్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రజల కష్టానష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ అని, దశాబ్దాలుగా సీమాంధ్రుల పాలనకు వ్యతిరేకంగా నిలిచి పోరాడి రాష్ర్టాన్ని సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని సుమన్ కొనియాడారు. జనరంజక పాలన కేసీఆర్‌తోనే సాధ్యపడుతుందని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఇక్కడ చేపట్టబోయే సంక్షేమ పథకాలకు ఇతర దేశాల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు సీఎం కేసీఆర్ ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధమన్నారు. ఇటీవల కూడా సుమన్ సీఎం కేసీఆర్‌పై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఇటీవల కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా కేసీఆర్ పాలనపై సుమన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి తాను ప్రత్యేక తెలంగాణకు జై కొడుతూ వచ్చానని సుమన్‌ తెలిపారు.