ఎయిర్‌టెల్ పేమెంట్స్ తో మోసం… రూ.50 కోట్ల కుంభకోణం చేసి దొరికిపోయారు…

Saturday, March 10th, 2018, 02:00:45 PM IST

మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాడుతున్నారా..? ఒక్కసారి మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేదా చూస్కోండి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) షాకిచ్చింది. ఆ సంస్థపై రూ.5 కోట్ల జరిమానా కుడా విధించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ టెలికాం సేవలను వాడుతున్న కస్టమర్లు తమ మొబైల్ నంబర్లను ఆధార్‌కు లింక్ చేసే సమయంలో వారికి తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా ఎయిర్‌టెల్ వారి పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు, ఆ బ్యాంక్ ఖాతాలు ఎన్‌పీసీఐకి అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో కస్టమర్లకు చెందిన వంట గ్యాస్ సబ్సిడీ వారి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఎవరికీ తెలియకుండా జమ చేస్కున్నారు. దీంతో అలా జమ అయిన నగదును ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియలేదు. ఇక కొందరు తమకు వస్తున్న వంట గ్యాస్ సబ్సిడీ ఒక్కసారిగా ఆగిపోయే సరికి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చివరకు వారు తమకు వచ్చే సదరు గ్యాస్ సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయినట్లు గుర్తించి ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు చెందిన రూ.47 కోట్ల గ్యాస్ సబ్సిడీ ఆ అకౌంట్లలో జమ అయినట్టు గుర్తించారు.

విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ తొలుత ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌పై కొద్ది రోజులు నిషేధం విధించింది. అయినా బుద్ది లేకుండా మళ్ళీ అదే పని చేసింది. చేసేదేం లేక పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును వినియోగదారులు తమ తమ బ్యాంక్ అకౌంట్లకు ఉచితంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలు కల్పించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇక మరో వైపు సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఎయిర్‌టెల్‌లో ఆధార్ లింకింగ్ ప్రాసెస్‌ను యూఐడీఏఐ నిలిపివేసింది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌టెల్‌పై ఆర్‌బీఐ రూ.5 కోట్ల ఫైన్ వేసింది. కస్టమర్లకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా వారి పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసిన విషయం వాస్తవమే అని తెలిసిందని, దీంతో ఆ సంస్థపై రూ.5 కోట్ల ఫైన్ వేశామని ఆర్‌బీఐ తెలియజేసింది. కేవైసీ మార్గదర్శకాల పట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. ఇకనుండి ప్రజలు ఆన్ లైన్ పేమెంట్స్ చేస్కునే ముందుగాని, కేవైసీ చేస్కునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అంట సక్రమంగా ఉందొ లేదో చూస్కొని పేమెంట్స్ చేస్కోవాలని చెప్పింది.