అందరి చూపు సింగపూర్ వైపు…..కిమ్, ట్రంప్ ల భేటీపై ఉత్కంఠ!

Monday, June 11th, 2018, 10:45:17 AM IST

గత ఏడాదిన్నరగా అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా మధ్య అణ్వయుధాలు, ఖండాంతర క్షిపణిల తయారీ మరియు ప్రయోగం విషయమై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్న మాటల దూకుడుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కళ్లెం వేసేలా ఇదివరకు ఇద్దరిమధ్య అంతర్యుద్ధం నడిచింది. అయితే ఈ విషయమై ఇక ముగింపు పలకడానికి రెండు దేశాల అధినేతలు ఒకచోట కూర్చుని చర్చలు సాగించానికి అంగీకరించారు. నిజానికి ఇదివరకే ట్రంప్, కిమ్ లు భేటీ కావలసింది, అయితే అప్పట్లో ఉన్ తనతో భేటీకోసం ట్రంప్ ను ఒక లేఖ రాసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కిమ్ అమెరికా పై చేసిన కొన్ని అభ్యన్తరకర వ్యాఖ్యలకు నిరసనగా తాను కిమ్ తో భేటీకాలేనని ట్రంప్ బదులు పంపించారు. ఇక ఇన్నాళ్లకు మొత్తానికి రెండుదేశాల అధినేతలు ఈ అణ్వయుధ ప్రయోగ దూకుడు సమరానికి ముగింపు పలకాలని సింగపూర్ లో భేటీ అయి చర్చించాలని నిర్ణయించారు. అయితే ఈ మేరకు నిన్న ఆదివారమే కిమ్ అక్కడికి చేరుకోగా, ఆతర్వాత కొద్దీ గంటలకు ట్రంప్ చేరుకున్నారు.

అమెరికా అధ్యక్షుడితో ఉత్తర కొరియా అధ్యక్షుడు భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో వీరి కలయిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా వీరి చర్చల సందర్భంగా దాదాపు 3000 మంది పత్రిక ప్రముఖులు సింగపూర్ చేరుకున్నారు. నిజానికి కిమ్ అంతర్జాతీయ వేదికలకు వెళ్ళింది చాలా తక్కువ, అదీకాక ఇదివరకు అయన చైనా, దక్షిణ కొరియాలకు మాత్రమే అయన వెళ్లారు. కాగా తమకు నమ్మకం కలిగించి భద్రత పరమైన హామీని అమెరికా ఇచ్చినట్లయితే తాము చేపట్టిన అణు ప్రయోగ కార్యక్రమాన్ని వదిలిపెడతామని కిమ్ అంటున్నట్లు సమాచారం. తాము ఇద్దరిమధ్య జరిగే ఈ చర్చల ఒప్పందం తప్పనిసరిగా సఫలీకృతమయి కిమ్ ఉత్తర కొరియా ప్రజలకు శాంతిని కానుకగా ఇస్తారని, ఇకపై రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడి, ప్రజలు సుఖ శాంతులతో జీవనం సాగిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిద్దరి భేటీకి సింగపూర్ లోని ఒక హోటల్ వేదిక కానుంది. కాగా వీరి భేటీ మొత్తానికి అయ్యే ఖర్చు అక్షరాలా రూ.100 కోట్లవరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు……