అమరావతిలో కూడ సామాన్యుడికి చోటు లేదా బాబుగారు !

Thursday, November 29th, 2018, 10:45:10 AM IST

ఒక రాష్ట్ర రాజధానిలో సామాన్యుడు నిశ్చితంగా బ్రతకడమనే పరిస్థితి ఇకపై వచ్చేలా కనిపించడంలేదు. పాత రాజధానులన్నిటిలోనూ ఇదే పరిస్థితి ఉండగా కొత్తగా నిర్మితమవుతున్న అమరావతిలో సైతం ఇదే సిట్యుయేషన్ ఉండబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే అమరావతితో సహా చుట్టూ పక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రాగా ప్రభుత్వం ఆసరాతో ప్రయివేట్ వ్యక్తులు చేపడుతున్న పలు ప్రాజెక్టులు సామాన్యుడు ఆలోచనల్లో కూడ ఊహించనంత ఖరీదుగా ఉంటున్నాయి.

ఈ మధ్యే అమరావతి హ్యాపీ నెస్ట్ పేరుతో 14 ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీని మొదలుపెట్టారు. ఇందులో సకల సౌకర్యాలతో కూడిన లగ్జరీ ఇళ్లను నిర్మించి విక్రయించనున్నారు. ప్రీ బుకింగ్స్ కూడ మొదలయ్యాయి. వీటిలో ఫ్లాట్ ఆరంభ ధర 47 లక్షలకు పైమాటే. మిగతా ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తం 55 లక్షలకు చేరుతుంది. ఇది సామాన్యుడు భరించే ఖర్చు కాదు. రాబోయే రోజుల్లో మొదలుకానున్న ఇంకొన్ని ప్రాజెక్టులు కూడ ఇదే స్థాయిలో ఉండబోతున్నాయి.

ఇలా ఖరీదుగా నిర్మితమవుతున్న గ్లోబల్ సిటీని చూస్తుంటే గతంలో చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎలాగైతే ఖరీదుగా విస్తరించి సామాన్యుడ్ని శివార్లకు, పేదవాడ్ని మురికివాడలకు మాత్రమే పరిమితం చేసిందో అలానే అమరావతి కూడ బాబుగారి సారథ్యంలో సామాన్యులకి, , పెద్దవాళ్ళకి అందకుండా పోతుందని అనిపిస్తోంది.