రివ్యూ రాజా తీన్‌మార్ : అంధగాడు – అర్థ భాగం వరకు మాత్రమే ఆకట్టుకున్నాడు

Friday, June 2nd, 2017, 05:55:21 PM IST

తెరపై కనిపించిన వారు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్

కెప్టెన్ ఆఫ్ ‘అంధగాడు’ : వెలిగొండ శ్రీనివాస్

మూల కథ :

పుట్టుకతోనే చూపు లేకుండా పుట్టిన గౌతమ్ (రాజ్ తరుణ్) ఎవరైనా దాతలు సహాయం చేస్తే చూపిస్తుందని, అప్పుడీ ప్రపంచాన్ని కళ్లారా చూడొచ్చని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. అలా కళ్ళ కోసం ఆరాటపడుతున్న గౌతమ్ కు పాతికేళ్ళ వయసులో హీరోయిన్ సహయాంతో కళ్ళ మార్పిడి జరుగుతుంది.

కానీ గౌతమ్ కొన్నాళ్లకే గౌతమ్ తిరిగి డాక్టర్లను కలిసి తనకు చూపొద్దని, చూపు పోగొట్టమని అడుగుతాడు. పాతికేళ్ళు కంటి చూపు కోసం ఎదురు చూసిన గౌతమ్ వచ్చిన చూపును ఎందుకు కోల్పోవాలనుకుంటాడు ? అతన్ని అంతలా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు ?వాళ్ళు ఏం చేశారు ? చివరికి అతని జీవితం ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> మొదట రచయిత అయిన దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు మంచి కథను ఎంచుకోవడంతో పాటు ఫస్టాఫ్ మొత్తాన్ని మంచి రొమాంటిక్, కామెడీ ట్రాక్లతో ఎంటర్టైనింగా తయారుచేశాడు. కనుక మొదటి విజిల్ అతనికే వేయాలి.

–> అలాగే సరదాగా సాగిపోతున్న ఫస్టాఫ్లో ఇంటర్వెల్ సమాయానికొచ్చే ట్విస్ట్, సెకండాఫ్లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అప్పటికప్పుడు చాలా మంచిగా అనిపించాయి. కాబట్టి రెండవ విజిల్ వాటికి వేసుకోవచ్చు.

–> ఇక చూపులేని వ్యక్తిగా హీరో రాజ్ తరుణ్ నటన. హీరోయిన్ హెబ్బా పటేల్ స్కిన్ షో, సెకండాఫ్ మధ్యలో వచ్చే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ వంటివి ఆకట్టుకున్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ : 
–> మొదటి అర్థ భాగాన్ని చాలా బాగా డీల్ చేసిన దర్శకుడు సెకండాఫ్ ను మాత్రం చాలా వరుకు చెడగొట్టారు. కథనం ఉన్నట్టుండి సైడ్ ట్రాక్ తీసుకోవడంతో సినిమా రొటీన్ మరియు బోరింగా తయారైంది.

–> అలాగే రాజేంద్ర ప్రసాద్, రాజ్ తరుణ్ ల మధ్య కూడా అనవసరమైన సన్నివేశాల్ని ఎక్కువగా పెట్టడంతో విసుగనిపించింది.

–> ప్రధాన ప్రతి నాయకుడు రాజా రవీంద్రను మొదట పవర్ ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేసినా కూడా సినిమా మొత్తం అలాగే కొనసాగించకపోవడం, క్లైమాక్స్ లో బలహీనంగా తేల్చేయడంతో సినిమాలో వెయిట్ తగ్గిపోయింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> చూపులేని హీరో ఐ డాక్టర్ అయిన హీరోయిన్ వద్ద చూపున్న వ్యక్తిగా నటిస్తున్నా ఆమె ఏమాత్రం కనిపెట్టలేకపోవడం వింతగానే అనిపిస్తుంది.

–> ఆరంభంలో పవర్ ఫుల్ గా ఇంటెలిజెంట్ పోలీసాఫీసర్ గా కనిపించిన షియాజీ షిండే ఉన్నట్టుండి కామెడీగా మారిపోవడం కూడా చిత్రంగానే ఉంది.

చివరగా సినిమా సినిమా చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉందిరా ?
మిస్టర్ బి : ట్విస్టులు బాగున్నాయ్.
మిస్టర్ ఏ : ఓవరాల్ గా ఎలా ఉందో చెప్పు.
మిస్టర్ బి : అర్థ భాగం వరకు మాత్రమే ఆకట్టుకున్నాడు.