మిర్యాలగూడ మర్డర్ : దృశ్యం సినిమా స్కెచ్.. ప్లాన్ బెడిసికొట్టింది!

Thursday, September 20th, 2018, 09:55:27 AM IST

మిర్యాలగూడలో జరిగిన దారుణ ఘటన పై అనేక రకాల విషయాలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని ఏ మాత్రం సహించని తండ్రి మారుతీ రావ్ పక్కా ప్రణాళికతో హత్య చేయించాడని పోలీసులు నిర్థారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రణయ్‌ని హత్య చేసిన రోజున మారుతీ రావు వ్యవహరించిన తీరుపై కూడా పోలీసులు వివరణ ఇచ్చారు. హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అందరూ అనుకోవాలని దృశ్యం సినిమా టైపులో ఎలిబీ(సాక్ష్యం) సృష్టించుకునే ప్రయత్నం చేశాడు.

హత్య జరిగే సమయంలో తానక్కడ లేనని రుజువు చేసుకునేందుకు మారుతీరావు నల్లగొండ కలెక్టరేట్‌ లో పని ఉందని జేసీని కలిసేందుకు వచ్చాడు. అదే విధంగా దారిలో వేములపల్లి వద్ద మిర్యాలగూడ డీఎస్పీ, స్థానిక ఎస్‌ఐ కనిపించగానే ఎలాంటి అవసరం లేకున్నప్పటికీ వాహనం ఆపి వారికి కనిపించే ప్రయత్నం చేశాడు. తనకు హత్యకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడానికి దృశ్యం సినిమా లాజిక్ ను బాగా వాడినట్లు పోలీసులు తెలిపారు. కానీ మారుతీరావు ప్రయోగించిన ఆ ప్లాన్ అసలు రంగు బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక ప్రణయ్ హత్యలో భాగమైన మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు కోటి రూపాయలు డీల్ సెట్ చేసుకోగా అడ్వాన్స్ గా 15 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.