ఆప్ కు సవతి పోరు..!

Tuesday, March 31st, 2015, 08:28:18 AM IST


దేశ రాజకీయాలలో సంచలనం రేపి, ఢిల్లీలో కనీవినీ ఎగుగని మెజారిటీతో అధికారం చేపట్టిన ‘ఆప్’ పార్టీకి ఇప్పుడు పక్కలో బల్లెం తయారవుతున్నట్లు సమాచారం. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసి, పార్టీలో అసంతృప్తి పర్వానికి తెరలేపి బహిష్కరణకు గురైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన వీరిద్దరూ, పార్టీపై అసంతృప్తితో ఉన్న వారందరినీ ఒకచోటకు చేర్చి కొత్త పార్టీని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

కాగా ఇందులో భాగంగా రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 14న తమ మద్దతుదారులతో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశానికి ఆప్ లో లోక్ పాల్ స్థానం నుండి బహిష్కరణకు గురైన రామ్ దాస్ తో పాటు, సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇక ఒకవేళ గనుక వీరందరితో కొత్త పార్టీ ఆవిర్భవిస్తే ఆప్ కు పక్కలో బల్లెం తయారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.