టీ-న్యూస్ ఛానల్ కు ఏపీ నోటీసులు!

Saturday, June 20th, 2015, 09:37:42 AM IST


తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు నోటు కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ సంభాషణ చేసినట్లుగా విడుదలైన ఆడియో టేప్ ను ప్రసారం చేసిన ‘టి న్యూస్’ చానెల్ కు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి వచ్చిన పోలీస్ కమీషనర్ రమణ శుక్రవారం రాత్రి 11గంటలు దాటిన తర్వాత టిన్యూస్ చానెల్ సీఈఓ నారాయణ రెడ్డికి నోటీసులు అందించి అతని వద్ద నుండి కౌంటర్ కాపీని తీసుకున్నారు.

ఇక టిన్యూస్ చానెల్ కు ఏపీ ప్రభుత్వం అందించిన నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా టిన్యూస్ పేరిట నడుపుతున్న ఈ చానెల్ తెలంగాణ పరిధిలోకి వస్తుందని, సంబంధిత చట్టంలో ప్రోగ్రాం కోడ్ కు అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చెయ్యాలని పేర్కొన్నారు. కానీ ఈ నెల 7వ తేదీ 8.30గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా ఉన్న ఒక వార్తను పదేపదే ప్రసారం చేశారని, అది ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి విద్వేషాలను రేకెత్తించేలా ఉందని ఏపీ పోలీసులు జారీ చేసిన నోటీసులో తెలిపారు.

ఇక పరువునష్టం కలిగించేలా, అసత్యంతో కూడిన కధనాన్ని పదేపదే ఉద్దేశ్యపూర్వకంగా ప్రసారం చేసిన ఈ చానెల్ పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే ఈ కధనాన్ని ప్రసారం చేసిన సాక్షి చానెల్ కు కూడా నోటీసులు అందించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక కేబుల్ టీవీ నెట్ వర్క్ నియంత్రణ చట్టం-1995లోని సెక్షన్ 19 మేరకు ఈ నోటీసులు జారీ చేస్తున్నామని ఏపీ పోలీస్ టిన్యూస్ చానెల్ కు అందించిన నోటీసులో పేర్కొన్నారు.