ఏపీ ఎక్స్ ప్రెస్ వచ్చేస్తోంది!

Friday, June 5th, 2015, 06:51:57 PM IST


దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ శుక్రవారం గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో విజయవాడ నుండి న్యూఢిల్లీకి వెళ్ళే ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన విధంగానే తాము ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తున్నామని శ్రీవాత్సవ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ గుంటూరు, మంగళగిరి స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుంటూరు-గుంతకల్ మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని శ్రీవాత్సవ తెలిపారు. ఇక విజయవాడ నుండి ఢిల్లీకి వెళ్ళే ఏపీ ఎక్స్ ప్రెస్ లో తగిన సదుపాయాలను కల్పిస్తామని శ్రీవాత్సవ పేర్కొన్నారు.