కేంద్ర నిధులతోనే ఏపీ ప్రభుత్వ భవనాలు!

Thursday, July 30th, 2015, 10:54:45 AM IST


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలను కేంద్రం విడుదల చేసే నిధులతోనే నిర్మించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని మౌలిక సదుపాయాల కోసం వెయ్యి కోట్లు, భవన నిర్మాణాల కోసం 500కోట్లను విడుదల చేసిన నేపధ్యంలో ఆ నిధులను పూర్తిగా వినియోగించిన తర్వాతే మిగిలిన నిధులను మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర నిధులను వినియోగించి ప్రభుత్వ భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక రాజధానిలో ప్రభుత్వ భవనాలను 12,28,000చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని, ఇందులో రాజ్ భవన్ నిర్మాణ విస్తీర్ణం 65వేల చదరపు మీటర్లు ఉండగా, సచివాలయం నిర్మాణ విస్తీర్ణం 15వేల చదరపు మీటర్లు ఉండాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ భవనాల కాంప్లెక్సు నిర్మాణాలకు ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కోసం సీఆర్డీఏ కన్సెల్టెంట్ లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇక ప్రభుత్వ భవనాలు మినహా రాజధానిలో మిగతా నిర్మాణాలన్నీ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరగబోతున్నట్లు సమీప వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది.