100 రోజులు – అడుగులు ఎటు..?

Monday, September 15th, 2014, 01:23:22 PM IST

ఏపీ సీఎంగా చంద్రబాబు బాద్యత‌లు స్వీక‌రించి వంద రోజులు పూర్తవుతున్నాయి.ఎన్నో స‌వాళ్లు మ‌రెన్నో స‌మ‌స్యల మధ్య ముఖ్యమంత్రిగా ప‌ద‌వి బాధ్యత‌లు చేప‌ట్టిన చంద్రబాబు త‌న మార్క్ ప‌రిపాల‌న‌తో ముందుకు వెళుతున్నారు.

రాజ‌ధాని లేదు. ముఖ్యమంత్రికి.. మంత్రుల‌కు కార్యాయాలు లేవు. లోటు బ‌డ్జెట్‌తో మొద‌లైన రాష్ట్రం. అనేక స‌మ‌స్యలు.. అంతకు మించిన స‌వాళ్లు. రాష్ట్ర విభ‌జ‌న తెచ్చిన అనేక స‌మ‌స్యల మ‌ధ్య చంద్రబాబు సీయం పీఠం ఎక్కారు. అతిధి గృహంలో తాత్కాలిక కార్యాల‌యం ఏర్పాటు చేసుకొని.. టెంట్ల కింద స‌మీక్షలు నిర్వహిస్తూ పాల‌నకు శ్రీకారం చుట్టారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఉన్నారో.. ఎవ‌రితో ఏ ప‌ని చేయించుకోవాలో తెలియ‌ని అయోమ‌యం న‌డుమ‌.. పాల‌న చంద్రబాబు అనుభ‌వానికి స‌వాల్ గా మారింది. అయినా.. సంక్షభాన్ని సవాల్ గా తీసుకుంటానంటూ చంద్రబాబు త‌న పాల‌న ప్రారంభించారు.

ప్రమాణ స్వీకారం నాడే.. ఇచ్చిన హామీల మేర‌కు 5 సంత‌కాలు చేశారు. రైతు-డ్వాక్ర రుణ‌మాఫీ, బెల్టు షాపుల ర‌ద్దు, ఉద్యోగుల వ‌యోప‌రిమితి పెంపు, పెన్షన్లు 1500కి పెంపు, ఎన్టీఆర్ సుజ‌ల స్రవంతి అమ‌లుపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రతి అంశం ఇప్పుడు అమ‌లు దిశ‌లో ఉన్నాయి. ఉద్యోగుల వ‌యోప‌రిమితి నిర్ణయాన్ని అసెంబ్లీ వేదిక‌గా ప్రకటించ‌టంతో పాటు. ఆక్టోబర్ రెండు నుంచి ఎన్టీఆర్ సుజ‌ల స్రవంతి ప‌ధ‌కం అమ‌లుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి..

రుణ మాఫీ విష‌యంలో మాత్రం ఏపీ స‌ర్కార్ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై వ‌చ్చేనెల మొద‌టి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తోంది. గతేడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తింస్తుందని ప్రకటించింది ఏపీ సర్కార్.. అదికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. మూడు ధ‌శ‌లుగా రుణా మాఫీ చేస్తామ‌ని, ఈనెల‌లో మొద‌టి ద‌శ‌గా రుణా మాఫీ చేస్తామ‌ని మంత్రి పుల్లారావు చెప్పారు.

రాష్ట్ర ప‌రిస్థితిని ప్రజ‌ల‌కు వివ‌రించేందుకు శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు చంద్రబాబు. త‌న పాల‌నా కాలాన్ని. .గ‌త ప‌దేళ్లతో పోలుస్తూ కీల‌క రంగాలపై శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసారు. ఆర్ధిక, ఇరిగేష‌న్‌, హెచ్ఆర్‌డి, విద్యుత్‌, ప‌రిశ్రమ‌లు-పెట్టుబ‌డులు, గ‌వ‌ర్నెన్స్ మీద శ్వేత పత్రాల ద్వారా ప్రజ‌ల‌కు వివ‌రించారు. గ‌త ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. వీట‌న్నింటిన స‌రి చేసుకుంటూ ఎలా ముంద‌కెళ్లేది చంద్రబాబు గ‌ణాంకాల తో స‌హా వివ‌రించారు చంద్రబాబు.

అదే స‌మ‌యంలో.. భ‌విష్యత్ ప్రణాళిక‌ను వివ‌రించేందుకు ప్రాధాన్యత రంగాలతో ఏడు మిష‌న్లను ప్రభుత్వం ప్రక‌టించింది. మౌళిక వ‌స‌తులు, ప‌రిశ్రమ‌లు, స‌ర్వీసు సెక్టారు, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్, సోష‌ల్ సెక్టార్‌, అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్, ప్రమైరీ సెక్టార్‌ల వంటి రంగాల్లో మంత్రుల‌ను క‌న్వీన‌ర్లుగా ఏర్పాటు చేసి మిష‌న్‌ల‌ను ఏర్పాటు చేసారు. వాట‌ర్, ప‌వ‌ర్‌, రోడ్లు, గ్యాస్‌, ఫైబ‌ర్ ఆప్టిక‌ల్ కనెక్టివిటీ గ్రిడ్‌ల కోసం ప్రణాళిక‌లు రూపొందిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వీటి ద్వారా..రాష్ట్రంలో అన్ని కీల‌క రంగాలను పూర్తి స్థాయిలో అభివృద్దికి నిధులు. విధులు కేటాయిస్తూ కార్యాచ‌ర‌ణ ప్రక‌టించింది.

చంద్రబాబు తీసుకున్న కీల‌క నిర్ణయాల్లో ముఖ్యమైన‌ది రాజ‌ధాని ప్రక‌ట‌న‌. రాజ‌ధాని నిర్ణయంలో ఎక్కడా ప్రాంతీయ విబేధాల‌కు అవ‌కాశం లేకుండా.. ఎవ‌రిలో అసంతృప్తి రాకుండా చంద్రబాబు చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రించారు. తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ అంటే ముందుగానే చెబుతూ… రాష్ట మ‌ధ్య ప్రాంతం రాజ‌ధానికి అనుకూల ప్రాంత‌మ‌ని గ‌ట్టిగా చెప్పారు. అసెంబ్లీ వేదిక‌గా ఏపీ నూత‌న రాజ‌ధానిని ప్రక‌టించారు సీఎం చంద్రబాబు. విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో రాజ‌ధాని గురించి చెబుతూనే.. రాష్ట్ర స‌మ‌గ్ర అభివృద్ది ప్రణాళిక‌ను ఆవిష్కరించారు. రానున్న కాలంలో ఏపీ ముఖ‌చిత్రం ఎలా ఉండ‌బోతుందో వివ‌రించారు.

రాజ‌ధాని రాష్ట్ర భ‌విష్యత్‌కు కీల‌కం కావ‌టంతో.. రాజ‌ధాని ఏర్పాటు పై చంద్రబాబు జాగ్రత్తగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇప్పటికే రాజ‌ధాని ప్రక‌ట‌న జ‌ర‌గ‌టంతో.. దీనికి సంబంధించి భూ సేక‌ర‌ణ విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. 50-50 నిష్పత్తిలో భూసేక‌ర‌ణ విధానాన్ని అమ‌ల్లోకి తెస్తున్నారు. రాజధాని భూసేక‌ర‌ణ కోసం మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వేసిన ప్రభుత్వం… రాజ‌ధాని నిర్మాణ స‌ల‌హా క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే..రాజ‌ధాని నిర్మాణం పై మంత్రి నారాయ‌ణ నేతృత్వంలో ప‌లు రాష్ట్ర రాజ‌ధానుల‌ను ప‌రిశీలించిన క‌మిటీ..త్వర‌లో విదేశాల్లో కూడా ప‌ర్యటించ‌నుంది. సింగ‌పూర్‌, చికాగో త‌ర‌హాలో రాజ‌ధాని.. మౌళిక వ‌స‌తుల క‌ల్పన కోసం ప్రణాళిక‌లు సిద్దం చేస్తోంది.

రాష్ట్ర రాజధానిని ప్రకటించే విషయంలో మంత్రుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి.. రాజధాని సలహా కమిటీకి సారద్యం వహిస్తున్నమంత్రి నారాయణ తీరుపై కొంత మంది మంత్రులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా..రాజధాని విషయంలో రాయలసీమ ప్రాంతం నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా తర్వాత సద్దుమణిగింది.. బహుశా బాబు రాయలసీమకు చెందడం వల్ల దీనిపై పెద్దగా వివాదం లేకుండానే సమస్య ముగిసిపోయిందని చెప్పచ్చు.

తెలంగాణ రాష్ట్రం కూడా త‌న‌కు ముఖ్యమ‌ని ప‌దేప‌దే చెప్పే సీయం చంద్రబాబు.. ఆ రాష్ట్రంతో స‌త్పంబంధాలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ కొన్ని నిర్ణయాలు సీమాంధ్రుల‌కు ఇబ్బంది క‌లిగేలా ఉండ‌టంతో.. చ‌ర్చల ద్వారా స‌మ‌స్యలు ప‌రిష్కరించుకోవాల‌ని పిలుపునిచ్చారు. త‌రువాత‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చ‌ర్చల‌కు వెళ్లి.. ప‌లు కీల‌క అంశాల‌కు ప‌రిష్కారం క‌నుగొన‌టంతో పాటు.. రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా ఇద్దరు ముఖ్యమంత్రులు ప‌లు అంశాలపై చ‌ర్చించారు. త్వర‌లో ఇత‌ర అంశాల పై చ‌ర్చల‌కు మార్గం సుగ‌మ‌మైంది.

అభివృద్ది-సంక్షేమం రెండు క‌ళ్లుగా చెబుతున్న చంద్రబాబు త‌న పాల‌న‌లో ఈ రెండు రంగాల‌కు పెద్దపీట వేస్తున్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్రక‌టించిన విధంగా పెన్షన్ల పెంపు కు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా.. ఎన్టీఆర్ సుజ‌ల స్రవంతి, అన్నా క్యాంటీన్ వంటి వాటిని వ‌చ్చే నెల 2 నుంచి అమ‌లు చేసేందుకు డిసైడ్ అయ్యారు. అదే విధంగా డ్వాక్రా మహిళ‌ల‌కు ఇసుక రీచ్‌ల్లో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యిం చారు. అభివృద్ది ప్రణాళికలో బాగంగా…ప్రతీ జిల్లాను అక్కడి భౌగోళిక స్వరూపాల‌కు అనుగుణ‌గా అభివృద్ది చేయ‌టంతో పాటు ఏపికి హారంగా ఉన్న తీర ప్రాంతాన్ని గేట్‌వే గా మారుస్తాన‌ని చంద్రబాబు ప్రక‌టించారు. ప్రణాళికా బ‌ద్దంగా వ్యవ‌హరిస్తున్న సీఎం.. హామీల అమ‌లుతో పాటు నిధుల సేక‌ర‌ణ కోసం క‌మిటీని ఏర్పాటు చేశారు.

చంద్రబాబు.. తన మంత్రి వర్గంలోని మంత్రుల విష‌యంలో సీరియస్ గా ఉన్నారు. ప్రతీ ప‌ది రోజుల‌కోక‌ సారి మంత్రివ‌ర్గ స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్న సీఎం.. ప్రతీ నిర్ణయాన్ని మంత్రుల‌తో చ‌ర్చించిన త‌రువాతే అమ‌లు విధానాన్ని ప్రక‌టిస్తున్నారు. అదే విధంగా.. త‌న క్యాబినెట్‌లోని ప్రతి మంత్రికి 100 రోజుల కార్యాచ‌ర‌ణ నిర్ధేశించారు. 100 రోజుల ప్రణాళిక అమ‌లు పై మంత్రుల‌కు గ్రేడింగ్ విధానం పేరుతో వారిలో పోటీత‌త్వం పెంచే ప్రయ‌త్నం చేస్తున్నారు. మంత్రులు కొంద‌రు స్తబ్దత‌గా ఉండ‌టంతో..వారి పై చ‌ర్చల త‌ప్పవ‌ని క్యాబినెట్ స‌మావేశాల్లోనే చుర‌క‌లు వేస్తున్నారు చంద్రబాబు.అయినా కూడా కొంత మంది మంత్రుల పనితీరు సరిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…ఈ విషయంలో బాబు కూడా మంత్రులకు గ్రేడింగ్ ఇస్తున్నారు. చాలా మందిపై అసంత్రుప్తితో కూడా ఉన్నట్టు సమాచారం.

కేంద్ర ప్రభుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టిడిపి అధినేత‌.. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా ఢిల్లీ ప‌ర్యట‌న‌ల‌కు వెళ్లటం ద్వారా.. కేంద్రం నుంచి నిధులు-హామీలు రాబ‌ట్టేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇప్పటికే.. 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాలో పైలెట్ ప్రాజెక్టుగా ఏపికి అవ‌కాశం ద‌క్కింది. అదే విధంగా..పోల‌వ‌రం పై కేంద్రం ఆర్డినెన్స్ రావ‌టంతో.. ఇప్పుడు ఒడిశా, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్ర ప్రభుత్వాల తో సంప్రదింపుల కోసం ఆ రాష్ట్రల‌కు వెళ్తున్నారు. అదే విధంగా.. విభ‌జ‌న బిల్లులో స్పష్టం చేసిన విధంగా ఏపికి ప్రత్యేక హోదా, రాయ‌ల‌సీమ‌-ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రెవిన్యూ లోటు కార‌ణంగా నిధులు కేటాయింపు పై నిత్యం కేంద్రంతో ట‌చ్‌లో ఉన్నారు. ఈ వారంలో ఏపికి ప్రత్యేక హోదా ను కేంద్రం ప్రక‌టించే అవ‌కాశం ఉంది. అదే విధంగా.. 14వ ఆర్దిక సంఘం తో జ‌రిగిన స‌మావేశంలోనూ చంద్రబాబు ఏపికి కావాల్సిన నిధుల గురించి విపులంగా చెప్పారు. కొత్త రాజ‌ధానికి నిధుల‌తో పాటు..కేంద్ర గ్రాంటుల గురించి ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన రావడం లేదు.. దీనిపై కొద్దిగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయంతో ఏపీ సీఎం ఉన్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజ‌య‌వాడ‌-గుంటూరు మ‌ధ్య నిర్వహించారు. తొలి క్యాబినెట్ స‌మావేశం విశాఖ‌లో.. ఆగ‌స్టు 15వేడుక‌లు క‌ర్నూలు లో నిర్వహించారు. అదే విధంగా.. కేంద్ర ఆర్ధిక సంఘ స‌భ్యుల‌తో స‌మావేశం కూడా తిరుప‌తిలో ఏర్పాటు చేసారు. ఏపికి స్మార్ట్ సిటీ లు కేటాయిస్తే.. మొద‌టిది క‌ర్నూలుకే ఇస్తాన‌ని ప్రక‌టించారు. అదే విధంగా..కేంద్రం విభ‌జ‌న బిల్లులో ఇచ్చిన హామీ మేర‌కు ఏపికి కేటాయించే 11 జాతీయ విద్యా సంస్ధల‌ను ఒక్కో జిల్లాలో కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు బాబు.

పొరుగు రాష్ట్రఆలు..కేంద్రంతోనే కాదు.. త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాలు.. అనుభ‌వం.. బ్రాండ్ ఆమేజ్ తో ఏపికి పెట్టుబ‌డులు తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప‌లు మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల అధినేత‌లు చంద్రబాబుతో స‌మావేశ‌మై పెట్టుబ‌డులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. రాజ‌ధాని నిర్మాణం కోసం ప‌లు అంత‌ర్జాతీయ సంస్ధలు ముందుకు వ‌చ్చాయి. మెకెన్జీ.. ఎల్ అండ్ టి వంటి సంస్ధలు ఏపి ప్రభుత్వంతో ట‌చ్‌లో ఉన్నాయి. అనిల్ అంబానీ, బివికె, జిఎమ్మార్ వంటి వారితో చ‌ర్చలు జ‌రిపారు. అంతేకాకుండా.. జాతీయంగా.. అంత‌ర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ‌ల‌తో క‌మిటీ ఏర్పాటు చేసుకొని ప‌క్కా ప్రణాళిక‌తో ఏపి స‌ర్వతోముఖాభివృద్దికి ముందు కెళ్తున్నారు.

100 రోజులు అనేది ఓ ప్రభుత్వానికి చాలా తక్కువ సమయమే.. అయినా కూడా ఓ మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు భవిష్యత్ లో పాలన ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఈ 100 చాలు.. అయితే ఇప్పటికే కొన్ని పొరపాట్లు, మరికొన్ని తప్పులు జరిగాయనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.. వీటికి పరిష్కారం చూపెడుతూ ముందుకెళ్లాల్సిన బాధ్యత బాబుపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..