నిర్మాణం జరగకముందే అమరావతికి గుర్తింపు..!!

Friday, December 25th, 2015, 10:12:37 AM IST

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంతో అమరావతిపేరు ప్రపంచంలో వినిపించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇక, ఇదిలా ఉంటే, అమరావతిలో మొదటి దశ నిర్మాణాలను 2018 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందుకోసం ప్రణాళికలను రూపొందించుకుంటున్నది.

ఇక, దీనిని పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. 2019లో అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నది. అమరావతిలో ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. నిర్మాణాలు ప్రారంభం కాకమునుపే.. నేషనల్ గేమ్స్ నిర్వహించే బాధ్యతను దక్కించుకోవడం విశేషం. ఈ నేషనల్ గేమ్స్ కోసం 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. నేషనల్ గేమ్స్ ద్వారా అమరావతి నగరాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉద్దేశ్యం.

ఇక, విజయవాడ నగరంలో ఇండోర్ స్టేషన్ ఒకటి, ఇందిరాగాంధీ స్టేడియం మరొకటి ఉన్నాయి. ఇక ప్రపంచస్థాయిలో స్టేడియం ను నిర్మించేందుకు మూడు సంవత్సరాల సమయం ఉన్నది. కాబట్టి ఈ మూడేళ్ళలో స్టేడియం నిర్మాణం పూర్తవుతుంది అనడంలో సందేహం లేదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతీయ క్రీడలు జరుగుతాయి. ఇక, 2016 లో గోవాలో నిర్వహిస్తుండగా.. 2018 కోసం ఉత్తరాఖండ్, ఛత్తీస్ గడ్, హర్యానాలు బీడ్ ను దాఖలు చేశాయి. దీని ప్రకారం 2020 లో జాతీయ క్రీడలు జరగాలి. కాని, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు 2019 కి మార్చడం విశేషం.