పునాదిరాయి మోడీతోనే!

Monday, April 6th, 2015, 11:10:22 AM IST


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. ఇక మోడీని కలిసిన తర్వాతే రాజధాని శంకుస్థాపన తేదీని చంద్రబాబు ప్రకటించనున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ బృందంతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంగా ఇటీవల సింగపూర్ లో రాజధాని ప్లాన్ ను రూపొందించిన ప్రతినిధి బృందంతో భేటీ అయ్యి అందులో కొన్ని మార్పులను చంద్రబాబు సూచించారు. ఇక మే నెలలో పూర్తి ప్లాన్ సిద్ధం కానుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపనను ప్రధాని మోడీ చేత చేయించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారు.