భార్య మీద అనుమానంతో పుట్టిన పాపని చంపేశాడు…

Tuesday, November 13th, 2018, 03:00:28 PM IST

కట్టుకున్న భార్య మీద పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారి, పుట్టిన మూడు నెలల బిడ్డని గొంతు నులిమి చంపాడు ఓ కసాయి తండ్రి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దేవాలమ్మ నగరానికి చెందిన శిలువేరు శివ రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రామంతాపూర్ కి చెందిన అక్షర ని పెళ్లి చేసుకొని, సర్వీసు రోడ్డు పక్కన కిరానా దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి తరువాత అంత త్వరగా సంతానం వద్దని భార్యని చాల సార్లు ఇబ్బంది పెట్టాడు. అబార్షన్ చేపించుకోవాలని చాల సార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చాడు. అయినా కూడా అక్షర వినకుండా తన తల్లి వద్ద ఉంది ఒక పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.

ఈ క్రమంలో శివ తల్లిదండ్రులు అక్షర ని, మనుమరాలు నిహారికిని హైదరాబాద్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్షర దుకాణం లో ఉండగా, శివ పాప గొంతు నులిమి చంపేయడానికి ప్రయత్నించాడు. పాప బాగా ఏడవడంతో లోపలికి వచ్చిన అక్షర భర్త శివ చేసే ఘాతుకాన్ని అడ్డుకుంది. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపని హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లిన కూడా ఫలితం లేకపోయింది. పాప మరుసటి రోజు ఉదయం మృతి చెందడంతో, వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. నిందితుడి ఇంటి వద్ద పాప మృతదేహంతో బంధువులు ఆందోళనకి దిగారు. శివ ని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా, భార్య పై అనుమానం తో కూతురిని చంపానని చెప్పాడు.