అందమే ఆమె పాలిట శాపం….విశాఖలో యాంకర్ మృతి!

Monday, May 7th, 2018, 04:39:58 PM IST

ఇప్పటికే మహిళలకు రక్షణ రోజురోజుకి కరువైపోతుంది అని చెప్పడానికి, అక్కడక్కడా వారిపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలే రుజువులు. అలాంటిదే మనం ఇప్పుడు చెప్పుకునే మరొక తాజా ఘటన. వివరాల్లోకి వెళితే నాలుగు నెలక్రితం విశాఖ జిల్లా గోపాలపట్నం మండలం కొత్తపాలెం శివారు ప్రాంతంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఒడిశా జంట అద్దెకు దిగారు. మ్యూజికల్ నైట్స్ నిర్వహిచడం వారి వృత్తి. అయితే స్వతహాగా మంచి అందగత్తె అయిన ఆమె యాంకర్ గా కూడా పనిచేస్తుండేది. తెలుగు భాష రానప్పటికీ ఎలాగోలా సర్దుకుంటూ జీవిస్తున్నారు. కాగా భర్త ఒడిశా, హైదరాబాద్ లో మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంల కోసం తరచు వెళుతూ, వస్తూ ఉండేవాడు.

కొద్దిరోజులకు ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కాగా అదే ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తున్న ఆమె ఆర్ధికంగా సమస్యలు ఏర్పడడంతో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగినిగా చేరింది. ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని ఒకరోజు ఆమె ఎవరిచేతనో తగులబెట్టబడి విగత జీవిగా స్థానికులకు కనిపించింది. వెంటనే పోలీస్ లకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలికి చేరుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే అందగత్తె అయిన ఆమె పై అప్పటికే ఆ ప్రాంతంలోని కొందరు యువకులు కన్నువేశారని, ఆమె ఒంటరిగా ఇంట్లో వున్న సమయంలో కొందరు యువకులు ఆమె ఇంటి చుట్టుప్రక్కల తిరుగుతుండేవారని స్థానికులు చెపుతున్నారు.

అందులో ఒక యువకుడు ఆమెతో మాట్లాడేవాడిని, నలుగురు స్నేహితులను వెంటపెట్టుకుని తరచు అక్కడే తిరిగేవాడని, భర్త లేకుండా ఆమె ఒంటరిగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి ఇలా నిప్పంటించి వుంటారనే కోణంలో పోలీస్ లు అనుమానిస్తున్నారు. అలానే విడిపోయిన భర్త హస్తం ఇందులో ఏమైనా ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఆమె ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసింది, ఇంటి చుట్టుప్రక్కల వున్న సిసి కెమెరా ఫుటేజీ లను పరిశీలుస్తున్నట్లు తెలిపారు. కాగా ఆమె మరణంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి……