ఆ విద్యార్థిని చుట్టూ 12 మంది పనోళ్ళు.. ఎంత ఖర్చు చేస్తున్నారో?

Wednesday, September 12th, 2018, 09:00:34 PM IST


కోటీశ్వరుల పిల్లలు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డబ్బుంటే ఏదైనా వారి దగ్గరకు వచ్చేలా చేసుకుంటారు. అసలు విషయంలోకి వస్తే తన కూతురు ఏ మాత్రం కష్టపడకూదని ఒక సంపన్న తండ్రి తీసుకున్న జాగ్రత్తలు చుస్తే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే. బ్రిటన్ కు చెందిన ఒక ప్రముఖ బిలియనీర్ కూతురుకి ఏకంగా 12 మంది వర్కర్లను సహాయంగా ఉంచారట.

అందుకోసం గతంలో వారు పేపర్ లో ప్రకటన ఇచ్చి మరి పరిచారకులను ఎంచుకున్నారు. వారికీ స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారట. అమ్మాయి ప్రొద్దున లేవగానే వారి జీవితం మొదలవుతుంది. వంటకు ప్రత్యేకమైన చెఫ్ తో పాటు హౌజ్ కీపర్స్, ఒక తోటమాలి, ఒక ఆడపనిమనిషి, ఒక మగపనిమనిషి ఇలా పలు రకాలుగా ఆమెకు పనిచేసే వారు నిత్యం అంటిపెట్టుకొని ఉంటారు. ఇంతకు ఆ లక్కీ గర్ల్ ఎవరని అనుకున్నారా? ఆమె భారత సంతతికి చెందిన ఒక కోటీశ్వరుడి కుమార్తె. స్కాట్‌లాండ్‌, యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అభ్యసిస్తున్న ఆ టీనేజ్ అమ్మాయి క్యాంపస్‌లో గది తీసుకుని ఉంటోంది. అయితే ఆ గదిలో ఆమెకు సేవ చేసేందుకు తనతండ్రి 12 మంది పనివాళ్ళను ఉంచాడు.

హౌజ్ మేనేజర్, ముగ్గురు హౌజ్ కీపర్స్, ఒక తోటమాలి, మహిళా పనిమనిషి, మగపనిమనిషి, ఇంటికి అతిధులు వస్తే కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు మరో ముగ్గురు, వంట మనుషులు ఇద్దరు. ఇకపోతే త్వరలోనే అమ్మాయి కోసం విలాసవంతమైన భవనం సిద్ధం కానుంది. ప్రస్తుతం మరమ్మత్తు పనులు జారుతున్నాయి. యూనివర్శిటీలో గదులు అమ్మాయికి సౌకర్యంగా లేకపోవడం వల్ల తండ్రి కొన్ని కోట్లు పోసి ఈ భవంతిని కొనుగోలు చేశాడు. ఇక అమ్మాయి ఎప్పుడు చదువుకోవాలని అంటే అప్పుడు చదువుకోవాలి. అప్పుడే టీచర్లు రావాలి. తన కూతురికి చదువు చెప్పేందుకు వస్తే వారికి 30వేల పౌండ్లు (మన ఇండియన్ కరెన్సీలో 28 లక్షలకు పైగా) చెల్లిస్తామని తండ్రి ప్రకటన ఇచ్చారు.