బీజేపీ నేత లైంగిక దాడి.. బాదితురాలి వినూత్న నిరసన

Tuesday, May 8th, 2018, 10:34:11 AM IST

అధికార బీజేపీకి ఉత్తరప్రదేశ్ పరిణామాలు పంటికింద రాయిలాగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో మైనరు పై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడి ఘటన మరువకముందే…అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై అలాంటి ఆరోపణలు వచ్చాయి. తన సీనియర్ కొలీగ్ – బీజేపీ నేత సతీశ్ శర్మ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడనీ – తనను మూడేళ్లుగా మానసికంగా హింసిస్తున్నాడని లఖన్ పూర్ కు చెందిన దళిత మహిళ – న్యాయవాది ఆరోపించారు. లైంగికదాడి ఘటనను వీడియో తీసి తనను అప్పటి నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే వేధింపులకు – మానసిక క్షోభకు గురిచేస్తున్నాడనీ ఆమె వాపోయారు. ఈ విషయాలను ఆమె మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించడం – గుండు గీసుకుని నిరసన వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది.యూపీలో బీజేపీ అధికారం చేపట్టాక.. ఆ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది రెండోది. గత నెలలో ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పై ఒక మైనరు బాలిక ఇలాంటి ఆరోపణలే చేసింది. కాగా అతడిని రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కోర్టు జోక్యంతో కుల్దీప్ను సీబీఐ అరెస్టు చేసింది.

తన ఆవేదన గురించి విలేకరుల సమావేశంలో ఆ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీలో అతడు పెద్దనాయకుడు. అతడికి రాజకీయ అండ ఉన్నది. నా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. అందుకే ఇన్నిరోజులు మౌనంగా ఉన్నాను. నేను దళితురాలిని కావడం వల్లే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని బాధితురాలు వాపోయింది. నిందితుడు సతీశ్ శర్మపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళితే.. చాలారోజులు పట్టించుకోలేదన్నారు. చివరకు కేసు నమోదయితే చేశారు గానీ ఆ కామాంధుడిపై ఎలాంటి చర్యా తీసుకోవడంలేదని ఆమె ఆరోపించారు. అందుకే మీడియా సమావేశంలో అతడి బండారాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సోమవారం రాత్రిలోగా అతడిపై పోలీసులు ఏ చర్యా తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాపోయారు. ‘అవధ్ బార్ అసోసియేషన్ లో నేను ఫిర్యాదుచేశాను. నా గోడు అక్కడా ఎవరూ వినిపించుకోలేదు. ఘజీపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అతడిపై చర్యకు వారు ప్రతిసారీ వారు ఏదో ఒక సాకు చెపుతున్నారు. నా కుటుంబాన్ని చంపేస్తానని నిందితుడి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. డబ్బుతో సెటిల్ చేసుకోవాలని వార్నింగ్లు ఇస్తున్నారు’ అని దళిత న్యాయవాది చెప్పారు.