భారత అంధ బాలుడి ప్రపంచ రికార్డు!

Saturday, May 2nd, 2015, 05:45:33 PM IST


తమిళనాడులోని ఒక అంధబాలుడు మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించాడు. ఈ మేరకు 11 ఏళ్ళ శ్రీ రామానుజం అనే ఈ అంధ బాలుడు టీవీలో న్యూస్ చదివి ప్రపంచ రికార్డు సృష్టించి భారదేశ కీర్తిని ఇనుమడింపజేశాడు. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని ఉలియంపాళ్యంకు చెందిన 11 ఏళ్ళ శ్రీ రామానుజం పుట్టుకతోనే అంధుడు. అయితేనేమీ జీవితంలో ఏదైనా సాధించి పైకి వద్దామనుకున్న అతని సంకల్పం ముందు ఏ వైకల్యం అడ్డురాలేదు.

ఇక రామానుజం ఉలియంపాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా తాను ఎదగడానికి తనకెంతో ఇష్టమైన మీడియా రంగాన్ని ఎన్నుకున్న రామానుజం తమిళనాడులోని లోటస్ న్యూస్ చానెల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఇక బ్రెయిలీ లిపి సహాయంతో ఇటీవల నేపాల్ లో సంభవించిన భూకంపం, తదనంతర పరిణామాలు మొదలగు వార్తలతో 22 నిమిషాల న్యూస్ బులిటెన్ ను అతడు ప్రెజెంట్ చేశాడు.

ఇక దీనిపై టీవీ చానెల్ చైర్మన్ సెల్వకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఒక అందుడితో వార్తలు చదివించిన ఘనత తమ చానెల్ కే సొంతమైనదని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రామానుజానికి మొదట వారానికి ఒక బులిటెన్, తర్వాత ప్రతీ రోజు వార్తలు చదివే అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక వార్తలు చదవడంపై రామానుజం మాట్లాడుతూ తొలుత రెండు మూడు నిముషాలు తాను తడబడ్డానని తర్వాత అలవాటయ్యిందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.