నూతన రాజధాని సరిహద్దులు ఇవే..!

Saturday, November 8th, 2014, 07:10:16 PM IST

vijayawada-route
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిపై ఏపీ సర్కార్ కసరత్తులు తీవ్రం చేసింది. తాజాగా రాజధాని అంచనా సరిహద్దులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గుంటూరు ఆటోనగర్ నుంచి తూర్పు దిక్కుగా ప్రకాశం బ్యారేజీ నుంచి పదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమాన బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. దక్షిణాన ఆటోనగర్ వై జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ల పొడవునా 75 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వరకు రాజధాని ఎల్లలుగా ఉంటాయని చంద్రబాబు ప్రకటించారు.

రాజధాని ఎల్లలు ఇలా..
పడమర: బోరుపాలెం నుంచి రింగు రోడ్డు దాకా ( 6 కిలో మీటర్లు)
తూర్పు: ఆటో నగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ (10 కిలో మీటర్లు)
ఉత్తరం: బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ ( 18 కిలో మీటర్లు)
దక్షిణం: ఆటోనగర్ నుంచి రింగు రోడ్డు (16 కిలో మీటర్లు)

చంద్రబాబు నివాసంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామల రైతుల అభ్యంతరాలను మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబు ముందు ఉంచారు. పంటను బట్టి పరిహారం ఇవ్వాలంటూ మంత్రులు ప్రతిపాదించారు. దేవాలయ భూములకూ పరిహారం ఇవ్వాలని మంత్రులు ప్రతిపాదన చేశారు. అలాగే పట్టాల్లేని భూములు సాగు చేస్తున్నవారికి కొంత పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇళ్లు కోల్పోతున్నవారికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై చర్చించారు.