తమ్ముడు లాకప్.. అక్క పారాహుషార్…

Friday, May 4th, 2018, 04:00:02 PM IST

ఓ ఫైనాన్స్ సంస్థ పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మహిళ పరారీలో ఉంది. రాచకొండ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం…సైనిక్‌పురి సాయినాథ్‌పురం ప్రాంతానికి చెందిన క్రాంతికుమార్‌కు బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నట్లు ఓ గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఈఎంఐ కార్డు వివరాలను అప్‌డేట్ చేస్తున్నామని కార్డు నెంబరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబరు వివరాలను అడిగింది. అతడు వివరాలు తెలిపాడు. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ నెంబరు వచ్చింది దానిని చెప్పండని అడిగింది. అంతే అతడి బజాజ్ ఈఎంఐ కార్డు మీద రెండు దఫాలుగా రూ. 40 వేల విలువ చేసే సామగ్రిని కోనుగోలు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు మోసానికి పాల్పడింది వరికుప్పల నాగరాణి అలియాస్ బోదాస్ మాధవి, గుండ్ల మాధవి, అంజలి) ఆమె సోదరుడు వరికుప్పల వెంకట్ రాజుగా నిర్ధారించి వెంకట్ రాజును అరెస్టు చేశారు. వరికుప్పల నాగరాణి పరారీలో ఉంది.

అక్కాతమ్ముడు కలిసి వేసిన స్కెచ్..
డిగ్రీ వరకు చదివిన వరికుప్పల నాగరాణి బజాజ్ ఫైనాన్స్ సంస్థలో కొన్ని రోజుల పాటు టెలీకాలర్‌గా పని చేసింది. ఆ అనుభవం, పరిచయాలతో మోసాలు చేసేందుకు స్కెచ్ వేసింది. దీని కోసం పలువురు కస్టమర్ల సమాచారాన్ని తీసుకుని టెలీకాలర్ యాసలో ఫోన్ చేసి బురిడీ కొట్టిస్తున్నది. ఆమె పై విజయవాడ, హైదరాబాద్‌లలో గతంలో ఇదే తరహా మోసాల్లో కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

సమాచారం రాకుండా నెంబర్ మార్పు
వరికుప్పల నాగరాణి బజాజ్ ఫైనాన్స్ సంస్థల వినియోగదారుల వివరాలను సేకరించి వారికి మీ కార్డు ఈఎంఐ పరిమితి విలువను పెంచుతున్నామని చెప్పి అన్ని వివరాలు సేకరిస్తున్నది. మరో వైపు నాగరాణి బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వినియోగదారుడి ఫోన్ నెంబరు మార్పునకు విజ్ఞప్తి చేస్తుంది. సేకరించిన వివరాలను అందులో పొందుపరుస్తుంది. చివరకు ఓటీపీ నెంబరును దరఖాస్తు చేసే సమయంలో లైన్‌లో ఉండే ఖాతాదారుడికి మీకు ఓ నెంబరు వచ్చింది అది చెబితే మీ ఈఎంఐ కార్డు విలువ పరిమితి పెరుగుతుందని నమ్మిస్తుంది. అలా ఓటీపీ ద్వారా అసలు వినియోగదారుడి ఫోన్ నెంబరును మార్చేసి ఆమె ఫోన్ నెంబరును నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత సేకరించిన వివరాలతో బిగ్‌బజార్‌లో నిత్యావసర వస్తువులు, ఖరీదైన ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేస్తుంది. వాటిని తన సోదరుడు వరికుప్పల వెంకటరాజు ద్వారా స్థానికంగా ఉండే కిరాణా దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. ఇలా అక్కతమ్ముళ్ళ చాలా రోజుల నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ తెలిపారు.