మన్మోహన్ ను సిబిఐ ప్రశ్నించింది వాస్తవమేనా..!

Wednesday, January 21st, 2015, 01:43:43 PM IST


బొగ్గు గనుల కేటాయింపు విషయంలో అక్రమాలు జరిగాయి అనే విషయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సిబిఐ విచారించినట్టు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితం సిబిఐ అధికారులు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన విచారించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని అటు మన్మోహన్ సింగ్ కాని, ఇటు సిబిఐ కాని ద్రువీకరించడం లేదు. అలాగే వాస్తవం కాదనికూడా చెప్పడం లేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారమంగళం బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు ఒడిశాలోని తాలా బిర బొగ్గు బ్లాక్ 2ను 2005లో కేటాయించారు. ఆ కేటాయింపు విషయంలో అసలు ఏమి జరిగింది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను విచారించినట్టు తెలుస్తున్నది. 2005లో బొగ్గు గనుల శాఖ మన్మోహన్ సింగ్ దగ్గరే ఉన్నది. ఆ కేటాయింపు అప్పుడే జరగటంతో ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించారని తెలుస్తున్నది. కాగా ఈ విషయాన్ని సిబిఐ అధికార ప్రతినిధి కంచన్ ప్రసాద్ ద్రువీకరించడం లేదు. అలాగని నిరాకించకపోవడం విశేషం.

ఇక తాలాబిరా బొగ్గు గని బ్లాక్ 2 ను తమ సంస్థకు కేటాయించాలని 2005 మే 7, జూన్ 17న రెండు సార్లు కుమారా మంగళం బిర్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెండు సార్లు లేఖలు రాసినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై కూడా సిబిఐ అధికారులు మన్మోహన్ సింగ్ ను విచారించారని సమాచారం. ఇక, ఈ కేసుకు సంబంధించి ఈ నెల 27న సిబిఐ తన నివేదికను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించనున్నది.