హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ అయితే.. అమరావతికి బయో మెడికల్ టెక్నాలజీ

Wednesday, January 20th, 2016, 10:31:32 AM IST


చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టినప్పుడు హైదరాబాదుకు సాఫ్ట్ వేర్ రంగం పరిచయమే లేదు. కానీ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి.. పెట్టుబడులు తీసుకురావడానికి ఈ సాఫ్ట్ వేర్ రంగాన్నే చంద్రబాబు ప్రధానాస్త్రంగా చేసుకుని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగానికి పునాదులు వేశారు. అనతికాలంలోనే ప్రపంచప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్ వేర్ సంస్థలన్నింటినీ హైదరాబాద్ తీసుకొచ్చారు. రాష్ట్ర యువతకు ఉపాది కల్పించారు. యావత్ ప్రపంచాన్నీ హైదరాబాద్ వైపు చూసేలా చేశారు.

కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయ్యాక నవ్యాంద్రకు కొత్త రాజధాని అమరావతిని నిర్మించాల్సి వచ్చింది. ఎటువంటి వనరులూ లేని ఏపీ భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుంది.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏం చేస్తారు అని అందరూ ఎదురు చూస్తుండగా బాబు ఈసారి సాఫ్ట్ వేర్ రంగాన్ని కాకుండా బయో మెడికల్ టెక్నాలజీని ఎంచుకున్నారు. విదేశాలు తిరుగుతూ రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ పెట్టుబడులు తెచ్చే పనిలో పడ్డారు. నిన్న మంగళవారం దావోస్ పర్యటనకు వెళ్ళిన ఆయన మధ్యలో జ్యురిక్ తెలుగు అసోషియేషన్ సభ్యులతో మాట్లాడి బయో మెడికల్ టెక్నాలజీని గూర్చి అడిగి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. అప్పట్లో మనకు పరిచయంలేని సాఫ్ట్ వేర్ తో హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేసారో.. ఇప్పుడు అమరావతిని బయో మెడికల్ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని బాబు సంకల్పించినట్లు తెలుస్తోంది.