బాలయ్య మాట ప్రకారమే బాబు మారుతున్నారా..?

Tuesday, October 7th, 2014, 03:37:00 AM IST

balayya-babu
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఆయన నివాసం ఉంది. ఆ ఇంటిని పూర్తిగా పడగొట్టి.. కొత్త ఇంటిని నిర్మించాలని బాబు కుటుంబం నిర్ణయించింది. కొత్తింటి నిర్మాణం డిసెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నివాసముంటున్న ఇల్లు ఇరుకుగా ఉండడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అంధ్రప్రదేశ్ సిఎంగా చంద్రబాబును కలవడానికి నిత్యం అనేక మంది వస్తుండడంతో పాటు… కొన్ని సందర్భాల్లో అధికారిక సమావేశాలు కూడా నిర్వహించాల్సి వస్తోంది. ఒక్కోసారి పార్టీ కార్యక్రమాలు కూడా ఇంట్లోనే నిర్వహిస్తున్నారు. అయితే… వీటన్నింటికీ ఇల్లు సరిపోవడం లేదని సమాచారం. ఈ దృష్ట్యా.. ఇంటిని పెద్దదిగా నిర్మించాలనే నిర్ణయించారని తెలుస్తోంది.

కొత్త ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ… లేక్ వ్యూ అతిథి గృహంలో ఉండాలా లేక… తన కుటుంబం పేరిట ఉన్న ఫామ్ హౌస్ లో ఉండాలా అనేది బాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో అందరికీ అనుకూలంగా ఉండే ఇంటిని అన్వేషించే బాధ్యతను లోకేష్ దంపతులకు బాబు అప్పగించారు. దీంతో లోకేష్, బ్రాహ్మణిలు లేక్ వ్యూలో వసతులు ఎలా ఉన్నాయి? నివాసానికి యోగ్యంగా ఉంటుందా? అని పరిశీలిస్తున్నారు. అటు కొండాపూర్ లో ఉన్న చంద్రబాబు ఫామ్ హౌస్ ను కూడా పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారుల సూచనల మేరకు ఫామ్ హౌస్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనేది ఆలోచిస్తున్నారు. మొత్తానికి బాబు గారు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం… కొత్త రాజధాని నిర్మాణంతో పాటు ఇప్పుడు కొత్త ఇంటి నిర్మాణాున్ని కూడా భుజాన వేసుకున్నారు.

అయితే చంద్రబాబు ఇల్లు మారడానికి అసలు కారణ వేరే వినిపిస్తోంది. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాస్తు, జ్యోతిష్యాలను విశేషంగా నమ్ముతారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన దగ్గరుండి మరీ కొన్ని వాస్తుపరమైన మార్పులు చేయించారు. ఎన్నికల్లో టీడీపీ నెగ్గడంతో బాలయ్య వాస్తు సెంటిమెంటుకు విశ్వసనీయత చేకూరింది. తాజాగా చంద్రబాబు ఇల్లు మారుతున్నది వియ్యంకుడు బాలకృష్ణ సూచన మేరకేనని వినిపిస్తోంది. కాగా, ఆ నిర్మాణ పనులను బాలయ్యే పర్యవేక్షించనున్నారట. అటు లోకేశ్, బ్రాహ్మణి త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. దీంతో, ఓ చిన్నారి చంద్రబాబు కుటుంబంలోకి రానుండగా, ఆ బుజ్జాయి ఆటపాటలకు అనువుగా ఉండేందుకు వీలుగా నూతన నిర్మాణం చేపట్టనున్నారట.