లారెన్స్ పై చీటింగ్ కేసు

Friday, September 26th, 2014, 09:42:00 AM IST


ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ మరియు అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్ కుమార్ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో గురువారం చీటింగ్ కేసు నమోదు అయ్యింది. వివరాలలోకి వెళితే గతంలో ప్రభాస్, తమన్నా జంటగా నటించిన రెబల్ సినిమా నేపధ్యంగా ప్రొడ్యూసర్స్ కి, దర్శకుడికి వచ్చిన లావాదేవిల నేపధ్యంగా కేసు నమోదు అయ్యింది. కాగా 23కోట్ల రూపాయల బడ్జెట్ లోపలే తాను సినిమాను నిర్మిస్తానని అంతకన్నా ఎక్కువ అయిన నేపధ్యంలో ఆ మొత్తాన్ని తానే భరిస్తానని రాఘవ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సినిమాకు మరో 5 కోట్లు అధిక బడ్జెట్ అవ్వడంతో నిర్మాతలు తాము ఆ ఖర్చు భరించలేమని ఒప్పందం ప్రకారం లారెన్స్ చెల్లించాలని అడుగగా ఒక్కపైసా కూడా ఇవ్వనని లారెన్స్ తెగేసి చెప్పారు. ఇక గత్యంతరం లేని నిర్మాతలు భగవాన్, పుల్లారావులు కోర్టును ఆశ్రయించగా లారెన్స్ పైనా, మధ్యవర్తిగా వ్యవహరించిన రాజ్ కుమార్ పైనా కేసు నమోదు చెయ్యాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీనితో పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి లారెన్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.