బాబు పూర్తిగా విఫలం అయ్యారు: చిరు

Friday, October 31st, 2014, 09:00:55 AM IST


కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు అయిన మెగాస్టార్ చిరంజీవి గురువారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. అలాగే తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని అందుకే 50మందికి పైగా చనిపోయారని తీవ్రంగా ఆరోపించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తుఫాను సమయంలో కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పాకులాడారని విమర్శించారు. అలాగే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్న బాబు ఇప్పుడు రోజుకో మాట చెప్పి తప్పించుకు తిరుగుతున్నారని చిరంజీవి మండిపడ్డారు. ఇక కేంద్రం దగ్గర బాబుకు ఎలాంటి పలుకుబడి లేదని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి సాధించడంలో విఫలమయ్యారని మెగాస్టార్ ఎద్దేవా చేశారు. అలాగే పచ్చటి పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారని, భూసేకరణ కోసం రైతులను ఒప్పించాలి కానీ బెదిరించకూడదని చిరంజీవి ధ్వజమెత్తారు.