చిరంజీవి 150వ సినిమా చేయడం వెనుక అంత మ్యాటరుందా..?

Thursday, June 30th, 2016, 08:27:51 AM IST


చిరంజీవి.. సినిమాలు మానేసి 8 ఏళ్ళైనా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్న హీరో. అంతటి ఛరీష్మా ఉన్న అయన 2009 ఎన్నికల్లో పార్టీ పెట్టి ఓటమిపాలై కాంగ్రెస్ లో కలిసిపోయారు. ఎన్నికల వేళ, ఎన్నికల అనంతరం ఆయన చేసిన చిన్న చిన్న తప్పులే మెగా తప్పుగా మారి ఆయన్ను పాతాళంలోకి నెట్టాయి. ఇప్పుడు ఆయన గనుక ఓట్ల కోసం బయటకొస్తే సామాన్య జనం సంగతి అటుంచితే సొంత అభిమానులే ఆలోచనలో పడే అవకాశముంది. కనుక తిరిగి అభిమానుల్లో తనపై మునుపటి నమ్మకాన్ని తిరిగి సంపాదించాలనే చిరంజీవి 150వ సినిమాకి శ్రీకారం చుట్టారని కొందరి రాజకీయ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.

పైగా ఈ నమ్మకాన్ని రాబోయే 2019 ఎన్నికల్లో వాడుకోవాలని కూడా చూస్తున్నారట. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తెలుగు జనాభాలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎరిగిన ఏకైక వ్యక్తి ఒక్క చిరంజీవి మాత్రమే. కనుక కాంగ్రెస్ అధిష్టానం 2019కి చిరంజీవినే తమ సిఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాన్ని ఊహించే చిరంజీవి తెలుగు జనాలకు తిరిగి దగ్గరవ్వాలని ఈ 150వ సినిమా చేస్తున్నారని వినికిడి. ఈ పుకార్లలో ఎంతమాత్రం నిజం ఉందో తెలీదు కానీ ఓటర్లకు మాత్రం సినిమాని, రాజకీయాల్ని వేరు చేసి చూడగల విజ్ఞత అయితే ఖచ్చితంగా ఉంది.