హెచ్1బి వీసా దారులకు ఇక గడ్డు కాలమేనా?

Tuesday, August 21st, 2018, 05:27:10 PM IST

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పీఠాన్ని అధిష్టించినదగ్గరినుండి అయన స్వదేశీయులకి పెద్ద పీట వేస్తూ ఇతర దేశాలనుండి ఉపాధి కోసం వస్తున్న వారిపై వివిధరకాల ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెచ్1బి వీసాల ద్వారా అమెరికా దేశానికి వెళ్లి ఉద్యోగం చేయాలనుకునేవారిపై ట్రంప్ కొన్ని కఠిన నియమాలు జారీ చేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇటీవల యూఎస్‌సీఐఎస్‌ ప్రవేశపెట్టిన కొన్ని కఠిన నిబంధనల్లో ఒకటైన నిబంధన ఏంటంటే, ఎవరైతే హెచ్1బి వీసాకు మొదటి సారి దరఖాస్తు చేసుకుంటారో, వారు సరైన ధ్రువీకరణ పాత్రలు కనుక సమర్పించకపోతే వారి వీసాను తిరస్కరించడం జరుగుతుందట. ఇక ప్రస్తుతం అమెరికాలోని ఉద్యోగాలను మరియు ఉద్యోగులను హెచ్1బి విసాదారులకు ఇవ్వకుండా వుండే బిల్లును అమెరికన్ ప్రభుత్వం ఆమోదం తెలపాలని అమెరికా పౌర మరియు సేవల విభాగ అధిపతి ఎల్ ఫ్రాన్సిస్ సిప్నా వాషింగ్టన్ లో ఇటీవల జరిగిన ఇమ్మిగ్రేషన్ న్యూస్ మేకర్ అనే కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

2017లో యూఎస్‌సీఐఎస్‌ 3,65,000 హెచ్1బి వీసాలను మంజూరు చేయడం జరిగిందని, వాస్తవానికి వారికీ సరితూగే ప్రతిభ గలవారు, మరియు నైపుణ్యత గలవారు తమ అమెరికా దేశంలో కూడా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చెప్పదల్చుకుంది ఏంటంటే ఇక్కడి కంపెనీలు హెచ్1బి వీసాల ద్వారా ఇక్కడకు వలసవచ్చి ఉద్యోగాలు చేయాలి అనుకునేవారు పట్ల కఠినంగా వ్యవహరించాలని, వీలైతే హెచ్1బి వీసదారులకు సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడికి రప్పిస్తున్న కంపెనీలు మరియు సంస్థలపై అమెరికన్ ప్రభుత్వం నిషేధం విధిస్తే మంచిదని అయన అన్నారు. కాగా అయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అమెరికన్ ప్రభుత్వం రానున్న రోజుల్లో వలసదారులపై మరిన్ని ఆంక్షలు ప్రవేశపెట్టేలా ఉందని, తద్వారా స్థానికతకు మాత్రమే పూర్తి అవకాశం ఇచేలా చేస్తోందని, తద్వారా అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునే యువత ఇక అటువంటి ఆలోచనలు చాలావరకు వదులుకుంటేనే మంచిదని కొంతమంది నిపుణులు అంటున్నట్లు సమాచారం…..