కాంగ్రెస్ కొత్తలిస్ట్‌లో కొంద‌రికి షాక్‌లు!?

Wednesday, October 31st, 2018, 11:01:55 PM IST


మ‌హాకూట‌మి సీట్ల స‌ర్థుబాటు ఓ కొలిక్కి రాకపోవ‌డం…అధికార తెరాస పార్టీ అభ్య‌ర్థులు ప్ర‌చార ప‌ర్వంలో ముందంజ‌లో ఉండ‌టం తో ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన కేంద్ర‌ కాంగ్రెస్ వెంట‌నే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి తెలంగాణ‌లో జోరుగా ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ రోజు (బుధ‌వారం) టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని హుటా హుటిని ఢిల్లీకి వెళ్లి కీల‌క‌భేటీలో పాల్గొని మంత‌నాలు సాగించారు.
మ‌ధ్య‌హ్నం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ష‌బ్బీర్ అలీ, జానారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క వీరంతా కాంగ్రెస్ సీనియ‌ర్ జాతీయ నేత ఏకే అంటోనితో స‌మావేశ‌మై తుది జాబితాను సిద్ధం చేశార‌ని చెబుతున్నారు. మ‌హాకూట‌మిలో మిగ‌తా పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌ను మిన‌హాయించి మిగిలిన స్థానాల్లో పోటీప‌డుతున్న అభ్య‌ర్థులను ప‌రిశీలించి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తుది జాబితాను సిద్ధం చేసేసిందిట‌.

మ‌హాకూట‌మిలో పొత్తుల కార‌ణంగా కాంగ్రెస్ తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బ‌ల‌మైన స్థానాల్లో 27 నుంచి 29 వ‌దులుకుంటున్న‌ట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్‌ని ఆశిస్తున్న వారు 15 నుంచి 20 నియోజ‌క వ‌ర్గాల్లో అత్య‌ధికులు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్ని మిన‌హాయించి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తొలి ద‌ఫా 70 నుంచి 75 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తును మొద‌లుపెట్టింద‌ని, ఖ‌చ్చితంగా 75 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాపై ఆమోద ముద్ర ప‌డితే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌చార హోరు కాక‌పుట్టించిన‌ట్టే. అయితే ఇప్ప‌టికే టిక్కెట్లు ద‌క్కే ప‌లువురి పేర్ల‌ను కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారంలోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 41 పేర్లు విస్త్ర‌తంగా ప్ర‌చారంలో ఉన్నాయి. మిగ‌తా అభ్య‌ర్థుల జాబితాపైనా న‌వంబ‌ర్ 2 అంటే రేపు క్లారిటీ రానుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ లిస్టులో కొంద‌రికి ఊహించ‌ని శ‌రాఘాతం త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం ఇన్‌సైడ్ సాగుతోంది. అలాగే ఊహాతీతంగా కొన్ని కొత్త పేర్లు తెర‌పైకి రానున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఏదేమైనా రేప‌టికి కొత్త జాబితా వ‌స్తేనే అస‌లు సంగ‌తి తేలేది.