చిరు సాబ్.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంది..కాస్త ఆలోచించండి

Wednesday, May 25th, 2016, 08:23:14 AM IST


కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రస్తుతం సినిమాపై దృష్టిసారించి రాజకీయాలను పక్కన పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇబ్బందులు పడుతున్నది. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా పరాజయం పాలయింది. ఒక్క సీటునుకూడా పార్టీ గెలుచుకోలేక పోయింది. ఇలాంటి దుర్ఘతి కాంగ్రెస్ చరిత్రలోనే లేదు. అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం పోయాలని పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

రఘువీరా రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. దీనికి చరిష్మా కలిగిన నేతల అండ ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి కట్టబెడితే మంచిదని కొందరి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పునర్జీవనం పోసుకోవాలి అంటే చిరంజీవి నడుంబిగించాలి. చిరు ప్రజలలోకి వెళ్లి కాంగ్రెస్ గొప్పదనం గురించి, విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితుల గురించి చిరు ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రజలలోకి వెళ్ళగలిగితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగుపడుతుంది. లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టంగానే ఉంటుంది.