క్రైమ్ కహాని : ఏడాది పిల్లోడు హత్యచేశాడని.. ఫస్ట్ నైట్ ఆపేశారు..!

Wednesday, February 24th, 2016, 12:52:06 PM IST


ఏడాది పిల్లోడు హత్యచేశాడట : అప్పుడెప్పుడో తెలుగులో సుడిగాడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అప్పుడే పుట్టిన అల్లరి నరేష్ విలన్ ను చంపుతాడు. అలా చంపిన అల్లరి నరేష్ కోసం విలన్ వెతకడం మనం చూశాం. ఇది సినిమా, నిజజీవితంలో ఇటువంటి సంఘటనలు జరగవు. అయితే, ఈజిప్ట్ లో మాత్రం జరిగిందట. ఓ ఏడాది పిల్లవాడు హత్యాయత్నం చేయడమే కాకుండా.. ఏకంగా హత్య చేశాడట. దీంతో అక్కడి మిలిటరీ ధర్మాసనం ఆ పిల్లవాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పిల్లవాడు హత్య చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నరా.. అవును హత్యే. ఇప్పుడు ఆ పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు. మూడేళ్ళ క్రితం ఈజిప్టు రాజధాని కైరో కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫయోమ్ ప్రావిన్స్ లో హింస చెలరేగింది. ఆ హింసకు సంబంధించి 116 మంది పేర్లను అక్కడి మిలిటరీ అధికారులు నమోదు చేశారు. అందులో ఏడాది వయసు ఉన్న కోరాని పేరును కూడా చేర్చింది. తన పిల్లవాడు ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. బాలుడి వయసుకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ ఇస్తామని డిఫెన్స్ లాయర్ చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయం బయటకు తెలియడంతో..ప్రజలలో కలకలం రేగింది. ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. చివరకు అధికారులు నిజం తెలుసుకొని తప్పు జరిగిందని చెప్పి బాలుడిపై ఉన్న కేసును కొట్టేశారు.

యువకుడి ఫస్ట్ నైట్ ను అడ్డుకున్నారు.. ఎందుకంటే : ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. ఇక ఫిబ్రవరి 18న ఫస్ట్ నైట్ కు ముహూర్తం పెట్టారు. అంతా బాగుంది.. ఫస్ట్ నైట్ కి వెళ్ళబోతుండగా.. పోలీసులు, సంక్షేమ శాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటి.. ఏం తప్పు చేశారు. అతను చాలా పెద్ద నేరమే చేశాడు. తనకు హెచ్ఐవీ సోకింది అనే విషయం చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆ వైరస్ ను మరో అమాయకురాలికి అంటించేందుకు సిద్దమయ్యాడు. కొన్ని రోజుల క్రితం గల్ఫ్ వెళ్ళే ముందు జరిగే సాధారణ చెక్ అప్ లో భాగంగా అతనికి టెస్ట్స్ చేశారు. ఆ టెస్ట్ లలో అతనికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసింది. అంతే, అతని గల్ఫ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. పెళ్లి తరువాత శోభనానికి రెడీ అవుతున్న సంగతి ఎవరో ఓ ఆకాశరామన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు చెప్పడంతో బండారం బయటపడింది.