క్రైమ్ కహాని : ఒకవైపు ఉగ్రవాదులు.. మరో వైపు ఉన్మాదులు

Thursday, June 30th, 2016, 12:12:22 AM IST

ఇస్తాంబుల్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు : దేశాలన్నీ ప్రస్తుతం ఉగ్రవాదమే పెద్ద ముప్పుగా విలవిలలాడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఉగ్రదాడుల్ని ఆపలేకపోతున్నారు అధికారులు. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఉగ్రవాదులు తమ మారణహోమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో దాదాపు 50 మంది మరణించగా మరో 150 వరకూ గాయపడ్డారు.

 

జనాల మధ్యలోనే స్వాతిని నరికేశాడు : చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది జనాలు నిత్యం తిరిగే నుంగంబాక్కం లోకల్ రైల్వే స్టేషన్ లో ఉదయం 6:30 ప్రాంతంలో ట్రైన్ కోసమా ఎదురు చూస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఓ ఉన్మాది కత్తితో అతి దారుణంగా చంపి దర్జాగా అక్కడి నుండి పరారయ్యాడు. ముందుగా స్వాతితో గొడవపడ్డ ఆ హంతకుడిని అక్కడే ఉన్న జనాలు ఆపి అంటే స్వాతి బ్రతికుండేది. కానీ అక్కడి జనాలు చోద్యం చూస్తూ నిలబడటంతో అతగాడు బ్యాగులోంచి కత్తిని తీసి నరికేసి వెళ్ళిపోయాడు.

 

 

పాతబస్తీలో బయటపడ్డ ఐసిస్ సంబంధాలు : హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ పోలీసులకు సవాలుగానే ఉన్న ప్రాంతం పాతబస్తీ. అతిసున్నితమైన ఈ ప్రాంతంలో అన్న మతాల వారు కలిసి నివసిస్తుంటారు. కానీ లోపల మాత్రం అనేక అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ కు ఉగ్రముప్పు ఉందని అందిన సమాచారం మేరకు పాతబస్తీలో పోలీసులు భారీగా సోదాలు చెయ్యగా సిరియాలో ఉన్న ఐసిస్ ప్రధాన కార్యాలయంతో సంబంధం ఉన్న పలువురు పోలీసులకు దొరికారు. వీరంతా భాగ్యనగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది.