డిస్కౌంట్ ఇవ్వట్లేదని తుపాకీ తో హతమార్చిన వైనం…

Friday, November 2nd, 2018, 04:10:55 PM IST

మాల్ లో సరిపడా డిస్కౌంట్‌ ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి ఆ మాల్‌ లోని ఇద్దరు వ్యక్తులను తన వెంట తెచ్చుకున్న గన్ తో కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. నగరంలోని కంటోన్మెంట్‌ రోడ్‌ ప్రాంతంలో ఉన్న జేహెచ్‌వీ మాల్‌లోని దుస్తుల దుకాణానికి ఇద్దరు వినియోగదారులు వెళ్లారు. అందులో ఓ వ్యక్తికి సేల్స్‌పర్సన్‌కు మధ్య డిస్కౌంట్‌ విషయంలో అనుకోకుండానే వాదన జరిగింది. అది కొద్దీ క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చింది. అపుడు ఆ కస్టమర్‌ కోపంతో తుపాకీ బయటకు తీసి సేల్స్ పర్సన్ మీద కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ కాల్పుల్లో దుకాణంలోని ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని హాస్పిటల్ లో చేర్పించారు.

మాల్ లో మరణించిన వారిని సునీల్‌, గోపిలుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. గాయపడిన గోలు, విశాల్‌ల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మాల్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతం అంత భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు షాప్‌ను సీల్‌ చేసి మాల్‌ను ఖాళీ చేయించారు. నిందితుడిని పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.