ఇక ప్రత్యేక జిల్లా ఉద్యమం మొదలైంది

Monday, September 15th, 2014, 12:59:58 PM IST


కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం మరిన్ని ఉద్యమాలకు ఊపిరిపోస్తోంది.నియోజకవర్గాల పునర్విభజన అయ్యేవరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. లీకువార్తలు పెను దుమారాన్నే లేపుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే వనపర్తి, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లా డిమాండ్ ఊపందుకోగా.. తాజాగా భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ఉద్యమం మొదలైంది.

ఖమ్మంలోని కొత్తగూడెం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి అనధికార సమాచారం అందడంతో భద్రాచలంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ఉద్యమం ప్రారంభమైంది. జిల్లా హోదా భద్రాచలానికే దక్కాలంటూ భద్రాచలం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భద్రాచలం అభివృద్ధిలో బాగా వెనుకబడిందని.. తమ ప్రాంతాన్నే ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ తో.. ఈ ప్రాంత వాసులు ఉద్యమంలోకి దిగుతున్నారు. భద్రాచలంను జిల్లా చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. నిజానికి టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో పాటు గతంలో ఇక్కడ సింహగర్జనకు వచ్చినపుడు కూడా భద్రాచలాన్ని జిల్లాగా చేస్తామని ప్రకటించారు కూడా.