తెరపడనుంది… త్వరపడండి..!

Thursday, February 5th, 2015, 01:15:18 PM IST


ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇక, వీలైనంతగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ… తిట్టుకున్న పార్టీలు తమ అదృష్టాన్ని మరో రెండో రోజుల్లో పరీక్షించుకోబోతున్నాయి. అభివృద్ధి మంత్రంతో బీజేపి ప్రచారంలో పోతున్నది. బీజేపి ఇప్పటికే ఢిల్లీలోని 70 నియోజక వర్గాలలో ప్రచారం చేసింది. ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడి ఉదయం 9 గంటల నుంచే ప్రచారం చేస్తున్నది.

ప్రధాని మోడీ ఢిల్లీలో నాలుగు బహిరంగ సభలలో ప్రసంగించారు. అభివృద్దే తమ అజెండా అని, దానికోసం ప్రత్యేకంగా అజెండా రూపొందించలేదని…ఢిల్లీని ఎలా అభివృద్ధి చేయబోతున్నామో విజన్ ను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసినట్టు ప్రధాని వివిధ సభలలో చెప్పారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని ఇస్తే.. ఢిల్లీ అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తారని అన్నారు. 15 సంవత్సరాలపాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిలేదని, ఇక, అవినీతిని అంతమోదిస్తామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 49 రోజులలోనే చేతులెత్తేసిందని… మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. దాదాపు 120మంది బీజేపి ఎంపీలు, కేంద్ర మంత్రులు ఢిల్లీ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నది. గతంలో చేసిన తప్పులను మరలా చేయబోమని… తమకు పట్టం కట్టాలని ఢిల్లీ ప్రజలను కోరుతున్నది. కాంగ్రెస్, బీజేపిలు రెండూ అవినీతి పార్టీలే అని ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అటు ప్రచారంలో కాస్త వెనకబడింది. 15సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ 2014లో రికార్డు స్థాయిలో ఓటమి చెందటం ఆ పార్టీని కలిచివేస్తున్నది. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట్ల కూడా ఓడిపోతుండటం పార్టీని, నేతలను భయానికి గురిచేస్తున్నది.

ఇక, ఫిబ్రవరి 7న ఎన్నికలు జరుగుతుండగా, ఫిబ్రవరి 10న ఫలితాలు వెలువడతాయి. చూద్దాం ప్రజలు తీర్పు ఎలా ఉండబోతున్నదో..