మారుతున్న సమీకరణాలతో పెరుతున్న ఉత్కంఠ..!

Wednesday, February 4th, 2015, 01:16:32 PM IST


మరో రెండు రోజులలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాని మోడీ ఢిల్లీ ఇప్పటికే మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు. ఇక, బీజేపి తో దీటుగా అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. పనిలో పనిగా… మీడియా కూడా తమ సర్వేను నిర్వహిస్తున్నాయి. గతంలో బీజేపి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటుంది అని మీడియా చెప్పిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా, ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడిని బీజేపి ప్రకటించడంతో అంచనాలు తారుమారవుతున్నట్టు తెలుస్తునది.

అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నే కోరుకుంటున్నారు. అయితే, పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం ప్రజలు బీజేపి కోరుకుంటున్నారని గతంలో నిర్వహించిన సర్వే నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక, ఎప్పుడైతే… బీజేపి కిరణ్ బేడిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన సర్వే ప్రకారం.. బీజేపి… ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య అంతరం తగ్గిపోయినట్టు. రెండు పార్టీల మద్య పోటాపోటీ మరింత పెరిగింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దానిపై జాతీయ సంస్థలు కొన్ని సర్వేలు నిర్వహించాయి. ఏఏపీకి 35 నుంచి 40 రావొచ్చని కొన్ని సంస్థలు చెప్తుంటే.. 31నుంచి 36వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని మరికొన్ని సంస్థల సర్వేలు చెప్తున్నాయి.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని… ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నది. 120మంది ఎంపీలు, కేంద్రమంత్రులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. కిరణ్ బేడిని గెలిపించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే…బ్లాక్ మనీ లిస్టులో ఉన్న కొందరు ఏఏపీ పార్టీలోకి నిధులను మళ్ళించారని బీజేపి ఆరోపిస్తున్నది. గతంలో ఢిల్లీ ప్రజలు ఏఏపీ కి అధికారం కట్టబెడితే… 49 రోజులు పాలన సాగించి చేతులెత్తేసిందని బీజేపి విమర్శించింది. తమకు ఓటు వేస్తే… ఢిల్లీని అభివృద్ధి చేస్తామని మోడీ తన ప్రచారంలో భాగంగా తెలిపిన విషయం తెలిసిందే. అయితే… తాజాగా వస్తున్నా నివేదికలు మాత్రం బీజేపిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గెలుపు తధ్యం అనుకున్న ఢిల్లీలో గెలుపు సంక్లిష్టం అవుతుండటం ఇప్పుడు బీజేపిని ఆలోచనలో పదేస్తున్నది. బీజేపికి 31 నుంచి 36వరకు సీట్లు రావచ్చని సర్వేలు చెప్తున్నాయి.

ఇక, ఓటమిని మానసికంగా అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ ఏదో మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. మరి 70సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో తేలాలంటే మాత్రం ఫిబ్రవరి 10వ తేదీవరకు ఆగాల్సిందే.