దటీజ్… తలైవా!

Friday, December 12th, 2014, 05:20:30 PM IST


సూపర్ స్టార్ రజనీకాంత్… సినీ జనాలకే కాదు, మొత్తం ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. బస్ కండక్టర్ గా జీవితాన్ని మొదలెట్టి తరువాత సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి అందులోని అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి ఈయన. నేడు ఆయన పుట్టినరోజు. అభిమానులకు పండగరోజు. కారణం ఆయన పుట్టినరోజు కావడం మాత్రమే కాదు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఆయన వెండితెరపై తనదైన స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో నేడు ‘లింగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా అభిమానుల ఆశలు.. సినిమా విశేషాలు.. మీకోసం.

ఎన్నని చెప్పాలి ‘లింగ’ విశేషాలు.. చిత్రంలో ప్రతిదీ విశేషమే. నాలుగేళ్ల తర్వాత ఆయన నుండి ఈ సినిమా వచ్చింది. మధ్యలో కొచ్చాడియాన్ (విక్రమసింహ)గా వచ్చినా అది యానిమేషన్ చిత్రమవడంతో అభిమానులను నిరాశపరిచింది. ఈ పరిస్థితుల్లో తనకి ముత్తు, నరసింహ లాంటి అద్భుత విజయాల్ని ఇచ్చిన కె.ఎస్. రవికుమార్ దర్శకుడిగా ‘లింగ’ సినిమా మొదలెట్టారు. ఆర్నెలల్లో ఈ సినిమా పూర్తి చేయాలని షరతు విధించారు. సినిమాకి పలు సమస్యలు ఎదురైనప్పటికీ అనుకున్న సమయానికి రిలీజ్ చేసారు. దీంతో అభిమానుల సంతోషం అంబరాన్ని తాకింది.

నేడు థియేటర్ల ముందు అభిమానుల కోలాహలం అంతా… ఇంతా కాదు. ఇటువంటి సినిమా కోసం నాలుగేళ్ళు ఎదురు చూసిన అభిమానులు ఈ సినిమాని విజయవంతం చేసి తమ అభిమాన కథానాయకుడికి జన్మదిన కానుకగా ఇవ్వనున్నారనడంలో సందేహం లేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లోని ఆయన అభిమానులు కొందరు చెన్నై వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2400 థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఒక్క చెన్నైలోని మాయాజాల్ మల్టీప్లెక్స్ లోనే నేడు ఈ సినిమా దాదాపు 63 సార్లు ప్రదర్శితం కానుంది. ఈ సినిమా నేటి మొదటి ఆటతో ప్రారంభమై, రాత్రి 11:59 వరకు వరుసగా ఆడుతుంది. ఇది అరుదైన విషయమనీ, కేవలం రజనీకే సాధ్యమైందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ తలైవా..!