నితీష్ తదుపరి లక్ష్యం అదే.. 2019లో సాధ్యమేనా..?

Saturday, November 21st, 2015, 07:46:06 PM IST


నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎన్డీఏ తో కలిసి పనిచేసిన నితీష్.. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. ఆర్జేడి, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. బీహార్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. జేడియు, ఆర్జేడి, కాంగ్రెస్ పార్టీలను ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు బీహార్ లో సఫలమయ్యాడు అని చెప్పొచ్చు.

2014 ఎన్నికల్లో మోడీ హావాకు దేశంలోని అన్ని పార్టీలు తలోగ్గాయి. ఆ తరువాత రాష్ట్రాలలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలలో బిజేపి దారుణంగా పరాయజం పాలవుతున్నది. దేశంలో మోడీ హావా సాగినా.. రాష్ట్రాలలో మాత్రం మోడీ గాలి వీయడం లేదని దీనిని బట్టి చూస్తే తెలుస్తున్నది. దేశంలో యూపిఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కోటమి గురించి మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ లో మూడు పార్టీలు కలిసి మహాకూటమి గా ఏర్పడి ఎన్డీఏ ను మట్టి కరిపించాయి. అదే విధంగా దేశంలో కూడా ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు మహాకూటమి సిద్దం కావాలని అంటున్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.

నితీష్ కు ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని.. నితీష్ ఇప్పటి నుంచే అందుకు సిద్దం కావాలని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు నితీష్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పటం కుదరని పని. ఇక, 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగానే ఉంటారు. అయితే, ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నితీష్ దేశంలోని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలను ఏకం చేయగలిగితే.. నితీష్ కల నేరవేరోచ్చు. లేదంటే మాత్రం నితీష్ బీహార్ కే పరిమితం కావలిసి ఉంటుంది.