ట్రెండింగ్ : మొత్తానికి అరెస్టైన ప్రముఖ పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులు!

Thursday, March 15th, 2018, 05:30:20 PM IST

ప్రస్తుతం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు పెనుభూతం లా పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ. ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట కొత్తగా విడుదలవుతున్న సినిమాల పైరసీ ప్రింట్లు బయటకి వస్తూనే వున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కొన్ని వందలమంది అహర్నిశలు కష్టపడి తీసిన సినిమాని కేవలం కొన్ని గంటల వ్యవధిలో పైరవై రూపంలో దొంగిలించి చిత్ర పరిశ్రమకి నష్టం చేకూరుస్తున్నారు కొందరు. ఉగ్రవాదంలా పైరసీ కూడా ఓ మహమ్మారిలా తయారైంది. మరీ ముఖ్యంగా త‌మిళ‌నాట త‌మిళ రాక‌ర్స్‌, త‌మిళ బాక్స్ అనే సంస్థ‌లు సినిమా రిలీజైన రోజే పైర‌సీని మార్కెట్‌లోకి తీసుకొచ్చి నిర్మాత‌ల గుండెల్లో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.

పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో ర‌కాల ఆలోచ‌న‌లు చేస్తుంది. అయితే ద‌శాబ్దంగా పైర‌సీ దారుల ఆగ‌డాల‌కి అడ్డుకట్ట వేయ‌లేక‌పోయిన పోలీసులు రీసెంట్‌గా త‌మిళ రాకర్స్ అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్ర‌భుల‌ని ఎంతో శ్రమించి అరెస్ట్ చేశారు. విజుపురం మ‌రియు నెల్లై ప్రాంతాల‌లో ఈ ముగ్గురి నిందితులని కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిపైన కేసు న‌మోదు చేసిన పోలీసులు వారిని విచారించి మిగ‌తా వివ‌రాలు రాబ‌ట్టనున్నారు.

త‌మిళ రాక‌ర్స్ గ‌త కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాల‌ని కూడా రిలీజ్ రోజే ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తూ వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమా నిర్మాత‌ల‌ని కూడా వ‌ణికించిన వీరు సినిమా రిలీజ్ కొద్ది గంట‌ల‌లోనే సైట్‌లో అప్‌లోడ్ చేసి వారికి భారీ న‌ష్టాల‌ని మిగిలిస్తూ వ‌చ్చారు. కేవలం ఈ రెండు వెబ్సైటు లు మాత్రమే కాదని ఇలా పైరసీ చేస్తున్న మిగతా సైట్ లపై కూడా ప్రభుత్వం గట్టి నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు…..