తెలంగాణలో హోంగార్డులకు శుభవార్త!

Friday, December 5th, 2014, 04:22:23 PM IST


తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే హోంగార్డులకు వేతనాలను పెంచుతూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హోంగార్డుల జీతాలను 9వేల రూపాయల నుండి 12వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీన హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పరేడ్ అలవెన్స్ ను 28రూపాయల నుండి 100రూపాయలు పెంచినట్లు కెసిఆర్ ప్రకటించారు. ఇక హోంగార్డులకు జంటనగరాల పరిధిలో బస్ పాసులు, ఆరోగ్య భీమా, ఏడాదికి రెండు యూనిఫాంలు ఇస్తామని కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా పెంచిన వేతనాల వల్ల దాదాపు 16వేల మంది హోంగార్డులకు లబ్ధి చేకూరే అవకాశముంది. ఇక హోంగార్డులకు పెంచిన వేతనాలు ఏప్రిల్ నెల నుండి అమలులోకి రానున్నాయి.