యువతికి నగ్న ఫోటోలు పంపి బెదిరింపు…….. చివరకు అతడికి షాకిచ్చిన యువతి!

Wednesday, May 30th, 2018, 04:08:32 PM IST


యువతులపై లైంగిక వేధింపులు ప్రస్తుత కాలంలో మరింత ఎక్కువయ్యాయి. ఎక్కడో ఒకచోట అవి బయటపడుతూనే వున్నాయి. కొందరు అలాంటి విషయాలను చెప్పుకోలేక లోలోపలే మధనపడుతుంటే, మరి కొందరేమో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒక యువకుడు ఒక యువతీ తాలూకు నగ్న ఫోటోలను బయటపెడతానని బెదిరించి చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని ఒక యువతికి ఒకరోజు తన ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక మెసేజ్ వచ్చింది. నీ నగ్న ఫోటోలు నా దగ్గర వున్నాయి, వాటిని సోషల్ మీడియాలో బట్టబయలు చేయకుండా ఉండాలంటే నాకు కొంత డబ్బులు ఇవ్వాలని ఆ మెసేజి లో వుంది. అయితే ఆ మెసేజి ని పెద్దగా పట్టించుకోని యువతీ, యధాలాపంగా తన దినచర్యలో పడిపోయింది. అయితే మరుసటిరోజు తనకు అదే ఫేస్ బుక్ ఐడి నుండి మరొక మెసేజి వచ్చింది. ఈ సారి ఏకంగా ఒక నగ్న ఫోటో వచ్చింది.

తీరా ఆ ఫోటో చూస్తే, ఆ ఫోటోలో వున్నది ఆ యువతే అవడంతో, ఒక్కసారిగా షాక్ కు గురి అయింది. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిన యువతి, అతడెవరో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఒకవేళ మాజీ ప్రియుడు తన ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడేమో అని అతనికి కాల్ చేసి అన్నివిధాలుగా ఆరా తీస్తే చివరకు అతడు కాదు అని తేలింది. ఆ టెన్షన్ లో ఏమి చేయాలో తోచక వెంటనే సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొదట ఆ ఐడి ఎవరిదో తెలపాలని, అంతేకాక ఆ ఐడిని బ్లాక్ చేయాలని ఫేస్ బుక్ సంస్థకు మెయిల్ చేశారు. కానీ ఆ వివరాలు రావడానికి దాదాపు పదిహేను రోజులపైనే సమయం పదుతుందని తెలిసి వేరే విధాలుగా అతడిని గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పాత ఐడి బ్లాక్ కావడంతో ఇంతలో అతడు మరొక ఐడి క్రియేట్ చేసి మెసేజ్ చేయడం మొదలెట్టాడు.

ఈ ఛాన్స్ ని వదలకూడదు అనుకున్న పోలీసులు, అతడు అడుగుతున్న డబ్బులను తన బ్యాంకు అకౌంట్ లో వేస్తామని, బ్యాంకు డీటెయిల్స్ ఇమ్మని ఆ యువతీ ద్వారా మెసేజ్ చేయించారు. అయితే దానిని తెలివిగా పసిగట్టిన యువకుడు, ముందు తాను వచ్చి డబ్బు తీసుకుంటానని, మరొక సగం తన అకౌంట్ లో వేయమని చెప్పాడు. అయితే ఎక్కడికి రావాలని అడగ్గా, సికింద్రాబాద్ లోని ఒక అడ్రస్ చెప్పి అక్కడ వున్న ఒక బెంచి గుర్తులు చెప్పి అక్కడ డబ్బు ఉంచి ఆమెని వెళ్లిపొమ్మని మెసేజి చేసాడు. ఆమెతో సహా రంగంలోకి దిగిన పోలీసులు బెంచిపై డబ్బు ఉంచి అతడికోసం ఆ చుట్టుప్రక్కల కాపేశారు, చివరికి అతడు వచ్చి డబ్బు తీసుకోబోవడంతో ఒక్కసారిగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే అతడు మరెవరో కాదు, పేరు అన్వర్. స్వయానా యువతి మాజీ ప్రియుడికి స్నేహితుడు. అప్పుడప్పుడు ఆమె ప్రియుడి లాప్ టాప్ తీసుకుని వాడుకునే అన్వర్ ఒకరోజు ఆ యువతి ఫోటోలను లాప్ టాప్ లో ఉండడం చూసి తన మొబైల్ కు కాపీ చేసుకుని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

నిజానికి అన్వార్ ఇదివరకు ఒక వ్యాపారం పెట్టి లక్షల్లో నష్టపోయాడు. అప్పులు తీర్చలేని స్థితిలో వున్న అతనికి అనూహ్యంగా ఈ యువతీ నగ్న ఫోటోలు చిక్కడంతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకుందాం అనుకున్నాడు. చివరికి అతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ లు కేసు నమోదు చేసి కోర్ట్ కి తరలించారు. సోషల్ మీడియా మాధ్యమాలు వాడే వ్యక్తులు తమ ప్రైవసీ కి సంబంధించి ఫోటోలు కానీ ఇతర రహస్య సమాచారం ఏదైనా సరే ఇతరులతో పంచుకునేటపుడు వారు ఎటువంటి వారో, వారి వద్ద మన సమాచారం భద్రంగా వుంటుందా అనేది ఆలోచించుకోవాలని పోలీస్ లు చెపుతున్నారు……