సినిమా థియేటర్ లో బాలిక పై లైంగిక దాడి!

Thursday, May 3rd, 2018, 12:08:31 AM IST

ఓ వైపు అన్నిరంగాల్లో ఎన్నో అద్భుతాలతో దూసుకెళ్తున్న నేటిమానవుడు కొన్ని విషయాల్లో మాత్రం తప్పుడు ప్రవర్తనతో, మృగానికంటే నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఆడవారిపై పాశవిక చర్యలకు పాల్పడడం, ముఖ్యంగా అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలకు కొందరు దిగడం వంటి ఘటనలు వింటుంటే, అసలు మనం ఎటు పోతున్నాం అనే ప్రశ్న ఎదురవ్వక మానదు. కథువా, వున్నావ్ లాంటి ఘటనలు మరువక ముందే హైదరాబాద్ లో అటువంటి మరొక ఘటన తీవ్ర సంచలం రేపుతోంది. విషయంలోకి వెళితే, సంగారెడ్డిలో వుండే 15 సంవత్సరాల వయసుగల ఒక పేద బాలిక, కుటుంబ సమస్యల నేపధ్యంలో ఇక్కడ తన అన్నావదినల వద్దకు వచ్చి ఉంటోంది.

కాగా వారు నగరంలోని ఒకప్రాంతంలోని ప్రముఖ సినిమా థియేటర్ ఎదురుగా నివాసముంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉండడంతో, రోజూ నీటికోసం బాలిక థియేటర్ కు వచ్చి పట్టుకెళుతూండేది. రోజూ నీటి కోసం వస్తున్న ఆ బాలికను థియేటర్ లో పనిచేసే ఒక యువకుడు ఎప్పటినుండో గమనిస్తున్నాడు. కాగా రోజులానే నిన్న ఉదయం నీటికోసం వచ్చిన బాలికపై ఆ యువకుడు కర్కశంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను థియేటర్ బాత్రూం లో ఉంచి, బయట గడి పెట్టి వెళ్ళిపోయాడు.

నీటికోసం వెళ్లిన బాలిక ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో థియేటర్ కు వచ్చిన అన్న వదినలు జరిగిన విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని థియేటర్ యాజమాన్యం అండతో ఆ యువకుడి బంధువులు రాజీ ప్రయత్నాలు చేయసాగారు. కానీ వాటికి ఏ మాత్రం ఒప్పుకోకుండా యువకుడిపై పోలీస్ లు కఠినంగా వ్యవహరించి అతనిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా బాలికను వైద్య పరీక్షలా నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు……