రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : హైపర్ – పక్కా కమర్షియల్ బొమ్మ..!

Saturday, October 1st, 2016, 09:55:07 PM IST


తెరపై కనిపించిన వారు : రామ్, రాశిఖన్నా, సత్యరాజ్, రావు రమేష్..

కెప్టెన్ ఆఫ్ ‘హైపర్’ : సంతోష్ శ్రీనివాస్

మూల కథ :

హీరో సూరి (రామ్)కి తండ్రంటే పిచ్చి ప్రేమ. తండ్రి ప్రేమ కోసం ఏది చేయమైనా చేసేస్తూంటాడు. అలాంటి తండ్రికే ఓ ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఏంటీ? అది ఎవరి వల్ల వచ్చింది? తండ్రిని విపరీతంగా ప్రేమించే కొడుకు తండ్రి కోసం ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే క్లుప్తంగా హైపర్ కథ.

విజిల్ పోడు :

1. ఫస్టాఫ్‍లో స్క్రీన్‌ప్లేకి విజిల్స్ వేసుకోవచ్చు. ముఖ్యంగా హీరోకి తండ్రంటే పిచ్చి ఇష్టం. ఆ క్రమంలో హీరో, తన తండ్రిని కాపాడినందుకు ఒక రౌడీతో కూడా ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. ఇలాంటి విచిత్రమైన కాన్సెప్ట్‌తో ఫస్టాఫ్ అదిరిపోయేలా నడిచింది.

2. హీరో రామ్ ఎనర్జీని ఎక్కణ్ణుంచి పట్టుకొస్తాడో కానీ, డైలాగ్స్‌లో, ఎనర్జీలో అదిరిపోయాడు. రామ్ అంటే అందరికీ కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. అలాంటి కమర్షియల్ సినిమాలో అతణ్ణి చూడాలనుకునేవారిని అలా కూర్చొబెట్టి ఎంటర్‌టైన్ చేస్తాడు.

3. రావు రమేష్‌ను ఈతరంలో తెలుగు సినిమాకు దొరికిన ఓ వరంలా భావిస్తారు. తన పాత్రతో మామూలుగా నడిచే సినిమాను కూడా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తాడు. ఈ సినిమాలో అడుగడుగునా రావు రమేష్ ప్రతిభను చూడొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. కథ చాలా పాతది. హీరో తండ్రికి ఓ సమస్య ఉంటుంది. హీరో దానికోసం పోరాడతాడు. ఓవరాల్‌గా చూస్తే ఇదో రొటీన్ కథగా కనిపించక మానదు. అది ఢమ్మాల్ పాయింటే!

2. హీరోయిన్ రాశిఖన్నా అక్కడక్కడా అందాల ప్రదర్శన చేయడం తప్ప ఆమెకు ఒక రోల్ లేదు. తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే పాటల వరకు వచ్చి వెళ్ళడమే అని మరోసారి ఋజువుచేసిన సినిమా ఇది.

3. పాటలు మంచి వేగంతో ఎనర్జిటిక్‌గా నడిచే సినిమాకు అడ్డుకట్టలా తయారయ్యాయి. సెకండాఫ్‌లో అయితే మరీ అనవసరంగా పాటలు వచ్చినట్లనిపించింది.

దావుడా – ఈ సిత్రాలు చూశారు ..!!

–> ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే అసలు ఈ లోకంలో బతకలేరేమో అన్నట్టుగా సినిమా కనిపిస్తూ వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గవర్నమెంట్‍లో నిజాయితీ కలిగిన వాళ్ళంతా ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్ళేనా అనిపించకమానదు. మరిది సిత్రమే!

–> హీరో అనుకుంటే ఏదైనా ఇట్టే జరిగిపోతుంటుంది. మినిస్టర్‌తో ఆడుకోగలడు. మీడియా ముందు ఏదైనా చేయగలడు. ఇలాంటి సన్నివేశాల్లో కొన్నిచోట్ల లాజిక్ అన్నది కూడా పట్టించుకోరు. అదీ చిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : రామ్ కమర్షియల్ సినిమా తీస్తే ఎనర్జీతో ఇరగతీస్తాడ్రా బాబూ..!!
మిస్టర్ బి : అది సరే, కథ పాతదీ, లాజిక్ లేదూ, సెకండాఫ్ పాటలూ.. ఇవన్నీ చెప్పవే!?
మిస్టర్ ఏ : పక్కా కమర్షియల్ బొమ్మ అని చెప్పాక్కూడా మళ్ళీ లాజిక్, కథ ఏంటీ? ఎనర్జీని ఎంజాయ్ చేయాలంతే!!