విశాఖలో ఐఐఎం కు శంకుస్థాపన

Saturday, January 17th, 2015, 09:16:21 AM IST

babu
రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 11 జాతీయ యూనివర్శిటీలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విశ్వవిద్యాలయం ఐఐఎం కు నేడు విశాఖలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోయే గంభీరంలో పునాది రాయి వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యెక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఈ విశ్వవిద్యాలయం కోసం మొత్తం 536 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్దం చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేసిన తరువాత, మొదటి సంవత్సరం తరగతులను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి తదితరులు పాల్గొననున్నారు.

ఇక, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని విశాఖ ఎంపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు హరిబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన తెలియజేశారు.