కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం మృతి!

Tuesday, April 17th, 2018, 04:17:03 PM IST

ప్రస్తుతం అమెరికాలో ఒక భారత సంతతికి చెందిన ఒక కుటుంబ సభ్యులుమొత్తం నీటిలో కొట్టుకుపోయిన ఘటన ఆ ప్రాంత వాసుల మనసు కలిచివేసింది. విషయంలోకి వెళితే సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వెళ్తున్న వారు దురదృష్టవశాత్తూ కాలిఫోర్నియాలోని ఓ అమెరికాలో ఉంటున్న భారత సంతతి కుటుంబం నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పది రోజుల క్రితం వారు ప్రయాణిస్తున్న కారు ఈల్‌ నదిలో పడిపోయింది. సందీప్‌ కుటుంబం ఓరెగావ్‌లోని పోర్ట్‌ల్యాండ్‌ నుంచి దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌కు రోడ్డు మార్గంలో ఎస్‌యూవీ కారులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది అప్పటి నుంచి వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి.

కాగా నిన్న ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు సందీప్‌ తోటపల్లి(41), ఆయన కుమార్తె సాచి(9)విగా గుర్తించారు. గత వారమే సందీప్‌ భార్య సౌమ్య(38) మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. వారి కుమారుడు సిద్ధాంత్‌(12) ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. నదిలో 4 నుంచి 6 అడుగుల లోతులో కారు పడిపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. సందీప్‌, సాచిల మృతదేహాలు హోండా పైలట్‌ కారులోనే చిక్కుకుని ఉండగా బయటకు తీసినట్లు చెప్పారు.

నదిలో ఓ ప్రాంతంనుండి పెట్రోల్‌ వాసన వస్తున్నట్లు గుర్తించిన రెస్య్కూ టీం ఆ ప్రాంతంలో గాలించగా నీటిలో మునిగిపోయి ఉన్న కారు కనిపించినట్లు సమాచారం. గల్లంతైన సిద్ధాంత్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్‌ తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉన్నారు. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్‌ పదిహేనేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన మరణవార్తను విన్న ఆయన తల్లితండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వారి మరణవార్త గుజరాత్‌లోని సందీప్‌ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది…