సెల్ కోసం ఫ్రెండ్ ని హత్య చేసిన ఇంటర్ స్టూడెంట్!

Monday, July 16th, 2018, 04:45:00 PM IST

నేటి సమాజంలో మనిషి ఆలోచనలు ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో టెక్నాలజిలో ముందుకు పోతున్న మనిషి, ఆలోచనలను మాత్రం పెడదోవన పెడుతున్నాడు. అలానే నేటి యువత పట్ల వారి వారి తల్లితండ్రులు కూడా శ్రద్ధ సరిగా పెట్టకపోవడం కూడా తెలిసి తెలియని వయసులో వారు నేరచరితులుగా మారడానికి కారణభూతం అవుతున్నాయి. ఇక విషయం లోకి వెళితే, కేవలం ఒక సెల్ ఫోన్ కోసం స్నేహితుడి ప్రాణం తీసాడు ఒక ఇంటర్ విద్యార్థి. హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో ఒకే కాలేజీలో చదువుతున్న ప్రేమ్, సాగర్ లు మంచి స్నేహితులు. అయితే ప్రేమ్ కొత్తగా ఈ మధ్య ఒక సెల్ ఫోన్ కొన్నాడు. ఆ సెల్ ఫోన్ పై కన్నేసిన సాగర్ ఎలాగైనా ఆ ఫోన్ ని తన సొంతం చేసుకోవాలని భావించాడు. ఒక కుటిల ఆలోచన చేసాడు. ఇద్దరం కలిసి లాంగ్ రైడ్ కి వెళ్దాము, వస్తావా అంటూ వూరికి దూరంగా తీసుకెళ్లి,

అతన్ని కిడ్నప్ చేసి, ఆ తరువాత అతనినుండి సెల్ ను తీసుకున్నాడు. అయితే అంతటితో ఆగకుండా, అతడిని ఆ చుట్టుప్రక్కలి ప్రాంతమైన ఆదిభట్ల కు తీసుకెళ్లి కొట్టి చంపేసి ఆపై తగులబెట్టినట్లు తెలిసింది. కాగా ప్రేమ్ కనిపించడంలేదని రెండురోజుల క్రితం థాని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణలో సాగర్ ని పట్టుకుని నిలదీయగా జరిగిన విషయం మొత్తం చెప్పుకొచ్చాడు. అయితే కేవలం సెల్ కోసమే అతన్ని చంపానని, అంతేకాని ప్రేమ్ పై తనకు ఎటువంటి పాగా లేదని సాగర్ చెపుతుండడం గమనార్హం. కాగా ప్రేమ్ మరణంతో వారి కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి విద్యార్థిని ఎంతో కిరాతకంగా హత్య చేసిన సాగర్ పై కేసు నమోదు చేసి శిక్షించాలని అతని సహచర కాలేజీ విద్యార్థులు కోరుతున్నారు….