జయరామ్ హత్యకేసులో ట్విస్ట్: కారులో యువతి..?

Saturday, February 2nd, 2019, 12:05:57 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. జయరామ్ ది హత్య అని ఇప్పటికే తేల్చిన పోలీసులు, కారులో ఎవరెవరు ఉన్నారన్న విషయమై స్పెషల్ టీమ్ ను పెట్టి విచారణ జరిపిస్తున్నారు. ఓ బృందం హైదరాబాద్ లోని ఆయన ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తుండగా, మరో బృందం హత్య జరిగిన ప్రాంతంలో విచారణ కొనసాగిస్తోంది. ముగ్గురిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. జయరామ్ సమీప బంధువైన ఓ మహిళను నందిగామకు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా, ఆయన కారులో ఓ యువతి కూడా ప్రయాణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఆయనతో పాటు ఒకరు లేదా ఇద్దరు ఉన్నారన్న నిర్దారణకు వచ్చిన పోలీసులు, వారు ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు. టోల్ గేట్ల వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ లో జయరామ్ కారు నడపడం లేదు. వెనుక ఇద్దరు ఉన్నట్టు మసకగా తెలుస్తోంది, దీంతో జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నామని, సాయంత్రానికి కీలక ఆధారాలు లభ్యమవుతాయని పోలీసులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం జయరామ్ మృతదేహం హైదరాబాద్ కు చేర్చగా, విదేశాల్లో ఉన్న ఆయన భార్య, పిల్లలు వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు వెల్లడించారు. పోలీసుల విచారణలో కీలక మలుపు తీసుకుంటున్న ఈ కేసు మిస్టరీ ఎపుడు వీడుతుందో.