సిబిఐ విచారణ అంటే భయమేలా..?

Wednesday, March 25th, 2015, 12:09:17 PM IST


ఇసుక మాఫియాను గడగడలాడించిన వాణిజ్య పన్నుల అధికారి రవి అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రవి మృతి విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని బెంగళూరులో ప్రజలు స్వచ్చందంగా రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేసిన సంగతి విదితమే. సిబిఐ విచారణ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 21వ తేదీన స్పందించిన విషయం మనం చూశాం. రవి మృతికేసును సిబిఐ చేత విచారణ చేయించాలా… అవసరం లేదా అన్న విషయం చెప్తామని ముఖ్యమంత్రి చెప్పేలోపే రవి అనుమానాస్పద మృతి విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రవి ప్రేమ విఫలం కావడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడని, రవి ఆమె బ్యాచ్ మీట్ ను ప్రేమించాడని, ఆయన మరణించే ముందు ఆమెకు 44 మెసేజ్ లు చేశాడనే వార్తా వెలుగులోకి వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కేవలం ఈ విషయంతోనే రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రవి తల్లిదండ్రులు చెప్తున్నారు. రవి అనుమానాస్పద మృతి విషయంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని అతని తల్లిదండ్రులు కూడా పట్టుబడుతున్నారు.

ఇకపోతే, రవి అనుమానాస్పద మృతి కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలి అనగానే చాలామంది రాజకీయనాయకుల గుండెల్లో భయం పట్టుకున్నది. సిబిఐ విచారణలో ఏయే విషయాలు అడుగుతారో… ఏమి చెప్పాలో… ఏవి చెప్పకూడదో అని భయపడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక కర్ణాటక హొమ్ శాఖ మంత్రి జార్జ్… రవి మృతి కేసును సిబిఐ కి అప్పగించబోమని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు సిబిఐ కి అప్పగిస్తే… జార్జ్ ను కూడా విచారణ చేసే అవకాశం ఉన్నది. ఇక కర్ణాటక హొమ్ మినిస్టర్ తో పాటు చాలా మంది రాజకీయ నాయకులను, వ్యపార వేత్తలను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అందువల్లనే సిబిఐ విచారణ అంటే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. తప్పు చేయకుంటే భయపడటం ఎందుకు..